Reading Time: 2 minutes
Watch: మరీ ఇలా తయారయ్యార్రేంట్రా.. ! చెప్పులు పోయాయని.. ఏకంగా ChatGPT అడిగాడు..!

మరీ ఇలా తయారయ్యారేంట్రా..! చెప్పులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేయడం చూశాం.. కానీ ఏకంగా ChatGPTని అడగడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఘటన మాత్రం ఏఐని ప్రజలు రోజువారీ జీవితంలో ఎంత విచిత్రంగా ఉపయోగిస్తున్నారో చూపిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయాన్ని సందర్శించాడు గోవాకు చెందిన శుభాంగ్ బోర్కర్. శుభాంగ్ తన క్లాగ్స్‌ను ఆలయం వెలుపల ఉన్న భారీ పాదరక్షల గుట్టలో పోగొట్టుకున్నాడు. చుట్టూ వందలాది చెప్పులు, షూలు ఉండటంతో తన జతను గుర్తించడం అతనికి కష్టంగా మారింది. దీంతో సాధారణంగా ఎవరూ ఊహించని విధంగా ChatGPT సాయం తీసుకున్నాడు.

శుభాంగ్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ముందుగా తన క్లాగ్స్ ఎలా ఉంటాయో చూపించే ఫొటోను ChatGPTకి పంపించాడు. అనంతరం ఆలయం వెలుపల ఉన్న షూ ర్యాక్‌లు, వాటి చుట్టూ కనిపిస్తున్న పాదరక్షల గుట్టల ఫొటోలను ఒక్కొక్కటిగా ఏఐకి పంపుతూ తన చెప్పులను గుర్తించమని కోరాడు. ప్రతి ఫొటోను పరిశీలించిన ChatGPT.. చివరకు ఒక నిర్దిష్ట జతపై దృష్టి పెట్టాలని సూచించింది. ర్యాక్‌కు కుడివైపున, కింద ఉన్న పాదరక్షల గుట్టలో తన క్లాగ్స్ ఉన్నాయని AI తెలిపింది. దీంతో శుభాంగ్ అక్కడికి వెళ్లి పరిశీలించగా.. ChatGPT చెప్పిన చోటే తన చెప్పులు కనిపించాయి!

ఈ అనుభవంతో ఆశ్చర్యపోయిన శుభాంగ్.. తాను, ChatGPT మంచి టీమ్‌గా మారామని సరదాగా చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. రోజువారీ జీవితంలో ఇలాంటి చిన్న సమస్యకు కూడా AIని ఉపయోగించవచ్చని ఈ ఘటన చూపించిందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇంతవరకు AIతో కంటెంట్ రాయించడం, ఫొటోలు ఎడిట్ చేయించడం, సమాచారం తెలుసుకోవడం మాత్రమే చూశామని.. పోయిన చెప్పులు వెతకడానికి కూడా ChatGPTని ఉపయోగించడం కొత్తగా ఉందని కొందరు పేర్కొన్నారు.

మరికొందరు మాత్రం సరదాగా స్పందిస్తూ.. “ఇంత కష్టపడటం ఎందుకు.. నచ్చిన మరో జత తీసుకుని వెళ్లిపోయేవాళ్లం” అంటూ కామెంట్లు చేశారు. ఏదేమైనా.. పోయిన చెప్పుల కోసం ChatGPT సాయం తీసుకుని, చివరకు వాటినే గుర్తించి పట్టుకోవడం ఇప్పుడు నెటిజన్లకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారింది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

 

View this post on Instagram

 

A post shared by Shubhang Borkar (@shubhangborkar)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..