
ఏపీలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రభుత్వం రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్ మొత్తానికి కలిపి బ్యాంక్ ద్వారా రుణాలు అందిస్తోంది. ఈ రుణాల వడ్డీ రేటు చాలా తక్కువగా ఉండటంతో పాటు ప్రతీ నెలా ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు. మహిళలకు ఆర్ధికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం ఈ రుణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ రుణాలను మహిళలు తమ ఆర్ధిక, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. గతంలో 10 మంది గ్రూపు సభ్యులు ఉంటేనే లోన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ నిబంధనలను ప్రభుత్వం సడలించింది.
8 మంది సభ్యులున్నా రుణం
ఇకపై 10 మంది సభ్యులు లేకున్నా బ్యాంక్ రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్‌ఎల్‌బీసీకి ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ గ్రామీణ బ్యాంక్ సానుకూలంగా స్పందించింది. కనీసం 8 మంది సభ్యులు ఉన్నా రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి 10 మంది సభ్యుల నిబంధనను పక్కన పెట్టి 8 మంది ఉన్నా లోన్ మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో 30 వేల సంఘాలకు లబ్ది చేకూరనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ తరహాలోనే మిగిలిన బ్యాంకులు కూడా నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. దీని వల్ల మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. బ్యాంకులు దీనిపై ఆలోచన చేయాలని కోరారు.
10 మంది కంటే తక్కువ ఉంటే..?
10 మంది కంటే తక్కువ సభ్యులున్న సంఘాలకు రుణం మంజూరు చేసేందుకు ఏపీ గ్రామీణ బ్యాంకు కొన్ని నిబంధనలు విధించింది. సభ్యులు వలస వెళ్లడం, మరణించిన సందర్భాలు, పాత బకాయిలు ఉండటం, సంఘంలో అక్రమాలు వంటి అంశాలను పరిశీలిస్తామని తెలిపింది. డ్వాక్రా సంఘాలు ప్రత్యేక తీర్మానం చేసి బ్యాంకులకు సమర్పించాలి. రుణ సడలింపు పొందాక ఆరు నెలల్లోపు సంఘాలు సభ్యుల సంఖ్యను 10కి పెంచుకోవాలి. ఈ నిబంధనలు పాటిస్తేనే రుణం మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. స్త్రీనిధి పథకం ద్వారా ప్రభుత్వం రూ.3 లక్షల వరకు రుణం అందిస్తోంది. ఈ నిధులతో కూరగాయలు, పండ్ల ప్రాసెసింగ్, పచ్చళ్లు, పిండి పదార్థాలు, స్నాక్స్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎప్పటినుంచో ప్రభుత్వం ఈ రుణాలను అందిస్తోంది. దీని ద్వారా లక్షలాది మంది డ్వాక్రా సంఘాలు లబ్ది పొందుతున్నాయి. కాగా రుణంతో పాటు మహిళలకు ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తోంది. మహిళలను ఆర్ధికంగా అభివృద్ది చేసేందుకు అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతోంది.