Reading Time: < 1 minute
Fuel price hike: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశ వ్యాప్తంగా ఉన్న వాహనదారులకు ప్రభుత్వం మరోసారి ఊహించని షాక్ ఇచ్చింది. దేశంలో ఇప్పటికే రెండు సార్లు ఇంధన ధరలను పెంచిన ప్రభుత్వం తాజాగా మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. తాజాగా పెరిగిన రేట్ల చూసుకుంటే.. పెట్రోల్ ధర లీటరుకు రూ. 0.87 పెరగ్గా, డీజిల్ ధర లీటరుకు రూ. 0.91 పెరిగింది. ఈ పెరిగిన ధరలు సైతం నేటి నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. అయితే దేశంలో ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి. గతంలో లీటరు పెట్రోల్‌పై రూ. 3 పెంచగా తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 90 పైసలు పెంచారు.

ప్రభుత్వ వివరణ

గత నాలుగేళ్లుగా దేశంలో చమురు ధరలు పెద్దగా పెరగలేదు. దీనివల్ల ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు వందల కోట్ల రూపాయల నష్టాలను చవిచూశాయి. ఆ నష్టాలను పూడ్చుకోవడానికే ఇప్పుడు ధరలు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది..

ఈ పెరుగుదలకు కారణం ఏమిటి?

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా పెరిగాయి . భారతదేశం తన ముడిచమురు అవసరాలలో దాదాపు 85% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది, అందువల్ల దేశీయ ఇంధన ధరలు ప్రపంచ చమురు మార్కెట్లలోని హెచ్చుతగ్గులకు బట్టి మారుతూ ఉంటాయి.

ధరల పెరుగుదలతో సామాన్యుడిపై ప్రభావం

తాజాగా పెరిగిన ధరలు కేవలం వాహనదారులకే పరిమితం కాదు. డీజిల్ ధరలు పెరగడం వల్ల లారీలు, రవాణా వాహనాల ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల మార్కెట్‌కు వచ్చే కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పాలు మరియు ఇతర సరుకుల ధరలు కూడా పెరిగి, ద్రవ్యోల్బణం ఎక్కువయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజాగా పెరిగిన ధరలు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఇవే రేట్లు

నగరం తాజా పెట్రోల్ ధర (లీటరుకు) తాజా డీజిల్ ధర (లీటరుకు)
హైదరాబాద్ రూ. 112.71 రూ.100.86
విజయవాడ రూ. 113.95 రూ.101.11
ఢిల్లీ  రూ. 99.51 రూ.92.49
ముంబై రూ. 108.46 రూ.94.99
బెంగళూరు రూ. 108.02 రూ.95.95
కోల్‌కతా రూ. 110.57 రూ. 96.98
చెన్నై రూ.105.38  రూ.97.02