Reading Time: 2 minutes

Harudu Review: క్రైమ్ స్టోరీతో నటుడు వెంకట్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్.. ‘హరుడు’ మూవీ ఎలా ఉందంటే?

Caption of Image.

టాలీవుడ్ నటుడు వెంకట్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఒకప్పుడు ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘అన్నయ్య’, ‘ఆనందం’, ‘శివరామరాజు’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నా వెంకట్.. తన కొత్త సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా పలు డిఫరెంట్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఇటీవలే OG వంటి భారీ ప్రాజెక్టులో కూడా నటించి మెప్పించాడు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన సోషల్ మెసేజ్‌తో కూడిన పోలీస్ స్టోరీ ‘హరుడు (Harudu)’. ఇవాళ మే 15, 2026న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. 

కథేంటంటే: 

ముంబైలో తన ఎన్‌కౌంటర్లతో నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించిన డిసిపి శంకర్ అలియాస్ ఎన్‌కౌంటర్ శంకర్ (వెంకట్) హైదరాబాద్‌కి బదిలీపై వస్తాడు. నగరంలో అడుగుపెట్టడమే ఆలస్యం.. తనదైన స్టైల్లో రౌడీలు, క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతాడు. ఈ క్రమంలో ఒక గంజాయి కేసులో అరెస్టయిన అమాయక ఆటో డ్రైవర్‌ను విడిపించే ప్రయత్నంలో, నగరంలో ప్రజల్లో మంచి పేరున్న బలమైన పొలిటికల్ లీడర్ ఎం ఎల్ ఎ వరదరాజులు (శ్రీహరి పైలా)తో శంకర్‌కు మొదటి పరిచయం ఏర్పడుతుంది.

మరోవైపు, నగరంలో కొందరు నిరుద్యోగులైన విద్యార్థులు తమ సొంత కాళ్లపై నిలబడటానికి ఒక ‘ఫుడ్ కోర్ట్’ పెట్టుకోవాలని కలలు కంటారు. దానికి కావాల్సిన పెట్టుబడి కోసం గత్యంతరం లేక యాక్సిడెంట్ అయిన కార్ల ఇంజిన్లను దొంగతనం చేసి అమ్ముతుంటారు. అయితే తమ చివరి దొంగతనంలో వారు పోలీసులకు దొరికిపోతారు. వారిని విడిపించేందుకు వరదరాజులు పోలీస్ స్టేషన్‌కు వస్తాడు కానీ, స్టేషన్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఆ విద్యార్థులపై ఘోరమైన దాడి జరుగుతుంది. ఈ దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారి సాక్షాత్తూ వరదరాజులే అని తెలిసి శంకర్ షాక్ తింటాడు.

బయటకి ప్రజల మనిషిగా కనిపిస్తున్న వరదరాజులు వెనుక ఉన్న క్రూరమైన రాజకీయం ఏమిటి? ఆ స్టూడెంట్స్ దొంగతనం చేసిన ఇంజిన్లకి, వరదరాజులు పొలిటికల్ కెరీర్‌కి ఉన్న లింక్ ఏంటి? అలాగే గతంలో శంకర్ భార్య ప్రియ (నటాషా సింగ్) హత్య వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? వీటన్నింటినీ శంకర్ ఎలా ఛేదించాడు? అనేదే మిగిలిన ఆసక్తికరమైన కథ.

ALSO READ : సూర్య, త్రిషల ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ.. దైవ అవతారంలో మాస్ రాంపేజ్..

విశ్లేషణ:

దర్శకుడు రాజ్ తళ్ళూరి కమర్షియల్ కాప్ డ్రామాకు ఒక భిన్నమైన సోషల్ పాయింట్‌ను ముడిపెట్టి ‘హరుడు’ చిత్రాన్ని చాలా ఆసక్తికరంగా మలిచారు. స్టూడెంట్స్ కార్ ఇంజిన్లను దొంగతనం చేసే ఎపిసోడ్ మరియు దాని వెనుక ఉన్న ట్విస్ట్ సరికొత్తగా ఉంటుంది. 

ఫస్ట్ హాఫ్ అంతా శంకర్ పవర్‌ఫుల్ పోలీస్ ఆటిట్యూడ్, స్టూడెంట్స్ దొంగతనాల చుట్టూ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ లో వచ్చే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ సెకండాఫ్‌పై అంచనాలను భారీగా పెంచుతుంది.

సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, భార్య సెంటిమెంట్ సీన్స్ క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌కు ఐ-ఫీస్ట్‌లా సాగుతుంది.

టెక్నీకల్ అంశాలు:

సినిమా చాలా రిచ్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా అద్భుతంగా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లను నెక్స్ట్ లెవెల్‌కు ఎలివేట్ చేసింది. విజువల్స్ చాలా బాగుండి, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. రన్‌టైమ్ కూడా క్రిస్పీగా ఉండటం సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

నటీనటుల పనితీరు

డిసిపి శంకర్ పాత్రలో వెంకట్ వన్-మ్యాన్ షో చేశాడు. ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా కనిపిస్తూ, డైలాగ్ డెలివరీ మరియు పవర్‌ఫుల్ కాప్ లుక్స్‌తో అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత ఆయనలో పూర్తి స్థాయి మాస్ హీరోని చూసే అవకాశం ఈ సినిమా కల్పించింది. హీరో భార్యగా నటాషా సింగ్ పరిమితమైన పాత్ర అయినప్పటికీ ఎమోషనల్ సీన్స్‌లో మరియు తన గ్లామర్‌తో మెప్పించింది.

హెబ్బా పటేల్ ఒక డిఫరెంట్ అండ్ బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. శ్రీహరి పైలా విలన్‌గా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూనే, క్రూరమైన పొలిటికల్ లీడర్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అలీ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించగా, ప్రత్యేక గీతంలో సలోని తన గ్లామరస్ స్టెప్పులతో రక్తికట్టించింది.

ముగింపు..

మొత్తంగా చెప్పాలంటే.. ‘హరుడు’ చిత్రం సీనియర్ నటుడు వెంకట్ సెకండ్ ఇన్నింగ్స్‌కు ఒక పర్‌ఫెక్ట్ కమర్షియల్ బూస్టప్ అని చెప్పొచ్చు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎలిమెంట్స్, సస్పెన్స్ ట్విస్టులు మరియు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ వినోదింపజేస్తుంది. మాస్, యాక్షన్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో తప్పక చూడాల్సిన చాలా బాగున్న సినిమా ఇది!

©️ VIL Media Pvt Ltd.