
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించిన ‘ఓటుకు నోటు’ కేసు నుండి మొదలుకొని ఎమ్మెల్యేల ఫిరాయింపుల వరకు ప్రతి అంశంపై ఆయన ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనేది కేవలం ఒక కల మాత్రమేనని, కనీసం రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కాపాడుకోవడానికైనా రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకుని బాధ్యతగా పని చేయాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్ష నేత కేసీఆర్ చేసే సూచనలను పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వానికి కొంతైనా గౌరవం దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Allu Arjun : ‘ముంబై’లో బన్నీ సెటిల్మెంట్ వెనుక అసలు నిజమిదే
తన ఢిల్లీ పర్యటనపై జరుగుతున్న ప్రచారాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ పరమైన పనుల కోసం ఎంపీ రవిచంద్ర, వినోద్ కుమార్‌లతో కలిసి బహిరంగంగానే ఢిల్లీ వెళ్లామని, ఇందులో దాచడానికి ఎలాంటి రహస్యాలు లేవని స్పష్టం చేశారు. అయితే సీఎంఓ నుండి మీడియాకు లీకులు ఇస్తూ రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా సుప్రీం కోర్టులో విచారణకు రానున్న ‘ఓటుకు నోటు’ కేసు విషయంలో రేవంత్ రెడ్డి భరతం పడతామని ఆయన హెచ్చరించారు. పట్టపగలు రూ. 50 లక్షల నగదుతో దొరికిన దొంగే ఈరోజు రాష్ట్రానికి హోమ్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తనపై ఉన్న కేసును నీరుగార్చడానికి ప్రభుత్వం తరఫున నామమాత్రపు న్యాయవాదులను పెట్టి, తన వ్యక్తిగత రక్షణ కోసం దేశంలోనే పేరుగాంచిన ఖరీదైన లాయర్లను రేవంత్ రెడ్డి నియమించుకున్నారని హరీష్ రావు ఆరోపించారు.
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా చేర్చుకుంటూ రాజ్యాంగ భక్షకులుగా మారుతున్నారని హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసిందని, మే 6వ తేదీన హైకోర్టులో జరగబోయే విచారణలో తమకే విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కూడా న్యాయం తమ వైపే ఉందని, ధర్మం కోసం తాము ఎంతటి న్యాయపోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ తరఫున తాము కూడా ఇంప్లీడ్ అయ్యామని, ఆనాడు తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడేలా చూస్తామని హరీష్ రావు హెచ్చరించారు. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రభుత్వ అక్రమాలను ఎండగడుతూనే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు.