
అమెరికాతో చర్చలపై ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికాతో చర్చలు జరపాలని ఇరాన్ బృందానికి సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో చర్చలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠ వీడబోతున్నట్లుగా తెలుస్తోంది.
రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగుస్తోంది. ఇంకా 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఇస్లామాబాద్ వేదికగా రెండో విడత చర్చలు జరుగుతాయా? లేదా? అన్నది సందిగ్ధం నెలకొంది. మొత్తానికైతే ఉత్కంఠ వీడినట్టుగా తెలుస్తోంది.
అమెరికాతో చర్చలకు సోమవారం అర్ధరాత్రి ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా ఆక్సియోస్ తన నివేదిక పేర్కొంది. ప్రభుత్వంలోని పెద్దలు నిరాకరిస్తున్నప్పటికీ.. మోజ్తాబా మాత్రం చర్చలు జరిపేందుకు మొగ్గు చూపినట్లుగా తన కథనంలో పేర్కొంది. అంతర్గత చర్చల అనంతరం సోమవారం రాత్రి ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుందని ఆక్సియోస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికాతో చర్చల కోసం ఇరాన్ బృందం మంగళవారం ఇస్లామాబాద్ చేరుకోవచ్చని తెలుస్తోంది.
మరోవైపు అమెరికా నుంచి జేడీ వాన్స్ బృందం కూడా ఇస్లామాబాద్‌కు బయల్దేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, సలహాదారు జారెడ్ కుష్నర్ సహా సీనియర్ అధికారులతో కలిసి మంగళవారం ఇస్లామాబాద్‌కు చేరుకోనుంది. అయితే ఇరాన్ బృందం ఎప్పుడు బయల్దేరుతుందన్నదానిపై స్పష్టత రాలేదు. చర్చలకైతే వెళ్లాల్సిందిగా ఇరాన్ బృందానికి మోజ్తాబా సూచించినట్లుగా సమాచారం.
ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో లాక్‌డౌన్ విధించారు. ప్రజలు రాజధానిలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున బలగాలు కూడా మోహరించాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. తొలి విడతలో దాదాపు 21 గంటల పాటు చర్చ జరిగింది. ఆ చర్చలు ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ చర్చలైనా ఫలిస్తాయో లేదో చూడాలి.