Reading Time: 2 minutes
How To Make Soft Paneer At Home 5 Easy Tips For Perfect Homemade Paneer

Perfect Homemade Paneer Tips: పనీర్‌తో రకరకాల వంటకాలు తయారు చేస్తున్నారు.. పనీర్ అంటే చాలా మందికి ఇష్టమైన ఆహారం.. ముఖ్యంగా విందులు, ప్రత్యేక సందర్భాలు, కుటుంబ భోజనాల్లో పనీర్ వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పనీర్ రుచికరంగా ఉండటమే కాకుండా, ఇందులో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వల్ల శాకాహారులకు ఇది మంచి ఆహారంగా భావిస్తారు. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే పనీర్‌పై కల్తీ భయాలు పెరగడంతో చాలా మంది ఇంట్లోనే పనీర్ తయారు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.

ఇంట్లో పనీర్ తయారు చేయడం సులభమే అయినప్పటికీ, చాలాసార్లు అది గట్టిగా మారిపోతుంది. మార్కెట్‌లో దొరికే హల్వాయి స్టైల్ మెత్తటి పనీర్ లాగా రావడం లేదని చాలామంది బాధపడుతుంటారు. ఇందుకు ప్రధాన కారణం తయారీ సమయంలో చేసే కొన్ని పొరపాట్లే.

పనీర్ గట్టిగా మారడానికి కారణాలేమిటి?
పాలు విరిగిన తర్వాత ఎక్కువసేపు మరిగించడం వల్ల పనీర్ రబ్బరు లా మారుతుంది. అలాగే పనీర్‌పై గంటల తరబడి ఎక్కువ బరువు పెట్టడం వల్ల అందులోని తేమ పూర్తిగా పోయి గట్టిపడుతుంది. వేడిగా ఉన్న పనీర్‌ను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టినా అది లోపల బయట గట్టిగా మారే అవకాశం ఉంది.

మెత్తటి పనీర్ కోసం ఈ 5 చిట్కాలు తప్పకుండా పాటించండి

1. నిమ్మరసం లేదా వెనిగర్ నెమ్మదిగా కలపండి: పాలు విరిచే సమయంలో నిమ్మరసం లేదా వెనిగర్‌ను ఒకేసారి పోయకుండా కొద్దికొద్దిగా వేయాలి. నీరు లేత ఆకుపచ్చగా మారగానే ఆపేయాలి.

2. వెంటనే మంట ఆర్పేయండి: పాలు విరిగి చెన్నా వేరుపడగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఎక్కువసేపు ఉడికిస్తే పనీర్ గట్టిపడుతుంది.

3. చల్లటి నీటితో కడగండి: వడకట్టిన చెన్నాపై వెంటనే చల్లటి నీళ్లు పోయాలి. దీంతో ఉడికే ప్రక్రియ ఆగిపోతుంది. అలాగే నిమ్మరసం లేదా వెనిగర్ పులుపు కూడా తొలగిపోతుంది.

4. ఎక్కువసేపు బరువు పెట్టవద్దు: పనీర్‌కు ఆకారం రావడానికి 30 నుంచి 40 నిమిషాలు బరువు పెడితే సరిపోతుంది. బుర్జీ లేదా సలాడ్ కోసం అయితే 15 నుంచి 20 నిమిషాలే చాలు. ఎక్కువసేపు బరువు పెడితే అది చూయింగ్ గమ్‌లా మారుతుంది.

5. చల్లటి నీటిలో నానబెట్టండి: బరువు తీసిన తర్వాత పనీర్‌ను వెంటనే కోయకుండా 10 నుంచి 15 నిమిషాలు చల్లటి నీటిలో ఉంచాలి. ఇలా చేస్తే బయట పొర గట్టిగా, లోపల మాత్రం క్రీమీగా మెత్తగా ఉంటుంది. మొత్తంగా ఇంట్లో పనీర్ తయారు చేసినప్పుడు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ప్రతిసారీ హోటల్ స్టైల్ మెత్తటి పనీర్ సిద్ధమవుతుంది. కుటుంబ సభ్యులకు రుచికరమైన పనీర్ వంటకాలు సులభంగా చేసిపెట్టవచ్చు.