Reading Time: < 1 minute
World Bank Raises India Gdp Growth Forecast To 6 6 For Fy2027 Amid Global Tensions

India GDP Growth: భారతదేశానికి ఆర్థిక రంగంలో ఊరటనిచ్చే శుభవార్త అందింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా ముందుకు సాగుతుందని ప్రపంచ బ్యాంక్‌ తన తాజా నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా 2027 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటును 6.6 శాతంగా అంచనా వేయడం విశేషం. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్‌-అమెరికా మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నప్పటికీ, భారతదేశంపై వాటి ప్రభావం తక్కువగానే ఉంటుందని నివేదిక సూచించింది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థిరత్వాన్ని మరోసారి నిరూపించుకుంటోందని పేర్కొంది.

Read Also: Ranveer Singh : ధురంధర్ – 2.. రెండు వేల కోట్ల మార్క్ అందుకోవడం అసాధ్యం

ఏప్రిల్ 2026లో విడుదల చేసిన “దక్షిణాసియా ఆర్థిక నివేదిక”లో భాగంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 6.3 శాతం నుంచి 6.6 శాతానికి పెంచింది వరల్డ్‌ బ్యాంక్‌.. అయితే, 2026 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన 7.6 శాతం వృద్ధి కంటే కొంత తగ్గుదల ఉండవచ్చని కూడా హెచ్చరించింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు వినియోగదారుల డిమాండ్‌ను పెంచే అవకాశం ఉన్నప్పటికీ, పెరుగుతున్న ప్రపంచ ఇంధన ధరలు ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచి, గృహ వ్యయ సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చని నివేదికలో పేర్కొంది. అదేవిధంగా, వంట ఇంధనం మరియు ఎరువులపై అధిక సబ్సిడీలు ప్రభుత్వ ఖర్చులను ప్రభావితం చేసి, వినియోగ వృద్ధి మందగించే అవకాశం ఉందని తెలిపింది.

ఇంకా, పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితి, ముడిసరుకుల ధరల పెరుగుదల కారణంగా పెట్టుబడుల వృద్ధి కూడా కొంత మందగించవచ్చని హెచ్చరించింది. ప్రపంచ ఇంధన మార్కెట్లలో అంతరాయాల వల్ల దక్షిణాసియా ప్రాంతంలో వృద్ధి 2025లో 7 శాతం నుండి 2026 నాటికి 6.3 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. కోవిడ్-19 వంటి క్లిష్ట పరిస్థితులనూ విజయవంతంగా ఎదుర్కొని వేగంగా కోలుకున్న దేశంగా భారతదేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని ప్రపంచబ్యాంక్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో, ప్రపంచ సవాళ్ల మధ్య కూడా భారత్ ఆర్థికంగా బలంగా ముందుకు సాగుతుందని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది.