Reading Time: < 1 minute
Vaibhav Sooryavanshi India Selection Debate Is It Too Early For Team India Call Up

ఇటీవలి కాలంలో భారత క్రికెట్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘వైభవ్ సూర్యవంశీ’. దేశవాళీ, ఐపీఎల్‌ వైభవ్ రాణిస్తుండడంతో.. టీమిండియాలో ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐకి మాజీలు, ఫాన్స్ సూచిస్తున్నారు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్.. ముంబై ఇండియన్స్‌పై చెలరేగాడు. 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులతో 39 రన్స్ చేశాడు. 15 ఏళ్ల వైభవ్ ప్రపంచ టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనే సిక్సర్లు బాదడంతో మరోసారి అతడిని భారత జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగాయి. అయితే సూర్యవంశీని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలా? లేదా మరికొంత సమయం ఇవ్వాలా? అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది.

ప్రస్తుతం భారత జట్టులో ఓపెనింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లు ఇప్పటికే మూడు ఫార్మాట్లలో నిరూపించుకుని జట్టులో స్థానం సంపాదించారు. మరోవైపు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులోనే ఉన్నాడు. వీరందరూ ఐపీఎల్‌కే పరిమితం కాకుండా.. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించి టీమిండియాలోకి అడుగుపెట్టిన వారే.

Also Read: Hardik Pandya: ఆ ఆట, షాట్స్ చూసి ఆశ్చర్యపోయా.. వైభవ్‌ సూర్యవంశీకి అంతా మంచే జరగాలి!

వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నప్పటికీ.. ఇంకా అంతర్జాతీయ స్థాయికి అవసరమైన అనుభవం సంపాదించాల్సి ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఐపీఎల్‌లో ఒకటి రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటం వేరే విషయం అని, అంతర్జాతీయ క్రికెట్‌లో నిరంతరంగా రాణించడం పెను సవాలే అని చెబుతున్నారు. భారత క్రికెట్ అభిమానులు కొత్త ప్రతిభను త్వరగా టీమిండియాలో చూడాలని కోరుకోవడం సహజమే. కానీ జట్టు అవసరాలు, ఆటగాడి సిద్ధత, అనుభవం వంటి అంశాలు కూడా చాలా ముఖ్యం. తొందరపడి అవకాశమిస్తే.. ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. అదే సరైన సమయంలో ఛాన్స్ ఇస్తే దీర్ఘకాలం జట్టుకు సేవలందించే అవకాశముంది. సూర్యవంశీకి భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా కనిపిస్తున్నప్పటికీ.. అతడిని వెంటనే జాతీయ జట్టులోకి తీసుకునే విషయంలో బీసీసీఐ, సెలెక్టర్లు సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.