Reading Time: 2 minutes
Arthur Wellard First Cricket Sixer King Records Rohit Sharma Comparison

The Original Hitman: క్రికెట్ చరిత్రలో సిక్సర్ల వీరుల గురించి మాట్లాడితే మనకు వెంటనే క్రిస్ గేల్, రోహిత్ శర్మ లేదా షాహిద్ అఫ్రిది వంటి పేర్లు గుర్తొస్తాయి. కానీ, ఏ విధమైన హెల్మెట్లు, అత్యాధునిక బ్యాట్లు లేని కాలంలోనే సిక్సర్లతో స్టేడియాలను హోరెత్తించిన ఒక అరుదైన క్రికెటర్ ఉన్నారని మీకు తెలుసా. ఈ రోజుల్లో భారీ బ్యాట్లు, చిన్న బౌండరీల వల్ల సిక్సర్లు కొట్టడం సులభం అవుతుంది. కానీ 1930ల కాలంలోనే 500లకు పైగా సిక్సర్లు బాది చరిత్ర సృష్టించిన ఘనత ఆర్థర్ వెల్లార్డ్ సొంతం. ఆయన వేసిన ప్రతి బంతి ఒక బుల్లెట్ అయితే, ఆయన కొట్టిన ప్రతి సిక్సర్ ఒక సంచలనం. నేడు (ఏప్రిల్ 8) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ ‘సిక్సర్ కింగ్’ అద్భుతమైన రికార్డుల గురించి తెలుసుకుందాం.

READ ALSO: LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై మరో బిగ్ అప్‌డేట్..

ఒక సీజన్‌లో 72 సిక్సర్లు..
ఆర్థర్ వెల్లార్డ్ 1935వ సంవత్సరంలో ఒకే సీజన్‌లో ఏకంగా 72 సిక్సర్లు కొట్టి అప్పట్లోనే ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ రికార్డు దాదాపు 50 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండిపోయింది. 1985లో ఇయాన్ బోథమ్ 80 సిక్సర్లు కొట్టే వరకు వెల్లార్డ్ పేరిటే ఈ రికార్డు ఉండేది. ఆర్థర్ వెల్లార్డ్ ప్రధానంగా ఫాస్ట్-మీడియం బౌలర్. ఇంగ్లాండ్ తరపున కేవలం రెండు టెస్టులే ఆడినప్పటికీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆయన ఒక లెజెండ్. 417 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఆయన 1,614 వికెట్లు పడగొట్టారు. ఇదే సమయంలో ఆయనలోని బ్యాటింగ్ విధ్వంసం చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ స్టార్ తన మొత్తం కెరీర్‌లో 12,485 పరుగులు చేయగా, అందులో సుమారు 25 శాతం పరుగులు కేవలం సిక్సర్ల ద్వారానే రావడం విశేషం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆయన మొత్తం 500 కంటే ఎక్కువ సిక్సర్లు బాదారు. ఆ రోజుల్లో ఈ గణాంకాలు అంటే ఊహకందనివి.

ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు..
ప్రస్తుతం టీ20ల్లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు చూడటం అరుదుగా జరుగుతుంటుంది. కానీ వెల్లార్డ్ 1930 ల్లోనే రెండుసార్లు ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాది చరిత్రాక రికార్డు నెలకొల్పారు. ఒకసారి డెర్బీషైర్‌పై, మరోసారి కెంట్ జట్టుపై ఆయన ఈ ఫీట్ సాధించారు. గ్యారీ సోబర్స్ 6 సిక్సర్లు కొట్టే వరకు వెల్లార్డ్ రికార్డే అగ్రస్థానంలో ఉండేది. భారీ సిక్సర్లకు మారుపేరైన వెల్లార్డ్, క్రికెట్ ప్రపంచంలో మొట్టమొదటి పవర్ హిట్టర్‌గా నిలిచిపోయారు. నేడు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ లాంటి వారు సిక్సర్ల రికార్డులను తిరగరాస్తున్న తరుణంలో, అసలు సిక్సర్ల మ్యాజిక్ ప్రారంభించిన ఆర్థర్ వెల్లార్డ్ చరిత్రను గుర్తు చేసుకోవడం ప్రతి క్రికెట్ అభిమానికీ స్ఫూర్తిదాయకం.

READ ALSO: Thalapathy Vijay: దళపతి విజయ్‌కు భారీ షాక్.. ఆ స్థానంలో ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న టీవీకే!