Reading Time: < 1 minute
Hardik Pandya Praises Vaibhav Sooryavanshi Heartwarming Gesture After Ipl 2026 Match

ఐపీఎల్ 2026లో మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ కేవలం ఆటతోనే కాకుండా భావోద్వేగ క్షణాలతో కూడా నిండిపోయింది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులతో 39 పరుగులు చేశాడు. 15 ఏళ్ల యువ సంచలనం ప్రపంచ టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఇక మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆప్యాయంగా పలకరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఓటమి బాధను పక్కన పెట్టి.. వైభవ్ ప్రదర్శనను అభినందించాడు. షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా.. గుండెపై చేయి వేసి బాగా ఆడావ్ అని మెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫాన్స్ పాండ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓడిపోయిన జట్టు కెప్టెన్‌గా ఉండి కూడా ప్రత్యర్థి యువ ఆటగాడిని ప్రశంసించడం ద్వారా హార్దిక్ తన స్పోర్ట్స్‌మన్‌షిప్‌ను చాటుకున్నాడు. అందుకే ఈ మ్యాచ్‌లో నిజమైన విజేతగా హార్దిక్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్య మాట్లాడుతూ… ‘వైభవ్ సూర్యవంశీ బాగా ఆడాడు. ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యంగా ఆడటం అద్భుతం. అతని ఆట, షాట్స్, బెరుకు లేమి చూసి నేను ఆశ్చర్యపోయాను. మ్యాచ్‌కు ముందు కూడా వైభవ్ గురించి చాలా చర్చించాం. ఎలా ఆడుతున్నాడు, ఎందులో బలహీనంగా ఉన్నాడు అని మాట్లాడుకున్నాం. ఒకటి మాత్రం చెప్పాలి.. వైభవ్ షాట్లు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. భవిష్యత్తులో అతను ఇంకా గొప్పగా రాణించాలని కోరుకుంటున్నాను’ అంటూ ప్రశంసలు కురిపించాడు.