Reading Time: < 1 minute
South Central Railway Cancels 15 Trains Ap Telangana April 12

తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ నిర్వహణ పనులు మరియు భద్రతా కారణాల దృష్ట్యా సుమారు 15 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల నిత్యం రైళ్లలో ప్రయాణించే వేల మంది ప్రయాణికులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య నడిచే మెము (MEMU) , డెము (DEMU) రైళ్లు ఈ రద్దు జాబితాలో ఉన్నాయి.

విజయవాడ, విశాఖపట్నం, కాచిగూడ, గుంటూరు , సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి నడిచే లోకల్ రైళ్లు ఎక్కువగా రద్దయ్యాయి. వేసవి కాలం కావడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం కొంత ఇబ్బందికరమైనప్పటికీ.. సురక్షిత ప్రయాణం కోసం ట్రాక్ మరమ్మతులు అత్యవసరమని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. ఇంకొన్ని రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.

Also Read:Post Jobs: పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు..

ఈ 15 రైళ్ల రద్దు ఏప్రిల్ 12, 2026 వరకు అమలులో ఉంటుంది. రద్దైన రైళ్ల వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ – విశాఖపట్నం (07466/07467), కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం (07456/07457), విజయవాడ – తెనాలి (07282/07279), విజయవాడ – ఒంగోలు (07278/07476), గుంటూరు – తెనాలి (07575/07440), విశాఖపట్నం – మచిలీపట్నం (17220), మచిలీపట్నం – విశాఖపట్నం (17219).

ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ముందు రైల్వే ఎంక్వయిరీ లేదా ‘నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సిస్టమ్’ (NTES) యాప్ ద్వారా రైళ్ల స్థితిగతులను తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్టేషన్లకు వెళ్లిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండేందుకు రైల్వే వెబ్‌సైట్‌ను కూడా పరిశీలించాలని కోరారు. రద్దైన రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ద్వారా తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోవచ్చు.