Reading Time: < 1 minute
Vijay Tvk Edappadi Nomination Rejected Setback Tamil Nadu Elections

Thalapathy Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరులో మొదటి అడుగులోనే స్టార్ హీరో విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి పోటీ చేస్తున్న ‘ఎడప్పాడి’ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఈ స్థానం నుంచి ఎన్నికల రేసు నుంచి పోటీకి ముందే టీవీకే తప్పుకున్నట్లు అయ్యింది. నిజానికి ఎడప్పాడి నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా అరుణ్ కుమార్ నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ పత్రాల పరిశీలన సమయంలో ఎన్నికల అధికారులు అందులో సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించారు.

READ ALSO: Rohit vs Sandeep: ‘హిట్‌మ్యాన్’ రోహిత్‌ శర్మనే అల్లడిస్తున్న భారత బౌలర్.. ఐపీఎల్‌లో షాకింగ్ గణాంకాలు!

ముఖ్యంగా నామినేషన్ పత్రాలపై ఉండాల్సిన ప్రతిపాదకుల సంతకాలు సరిగ్గా లేకపోవడంతో అధికారులు అరుణ్ కుమార్ నామినేషన్‌ను తిరస్కరించారు. నిజానికి నామినేషన్ పత్రాలపై అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తిని ప్రతిపాదిస్తూ 10 మంది సంతకాలు ఉండాలి. అయితే టీవీకే నుంచి ఎడప్పాడి స్థానం నుంచి బరిలో ఉన్న అరుణ్ కుమార్‌ నామినేషన్ పత్రాలపై ఎనిమిది మంది సంతకాలు మాత్రమే ఉన్నాయి. ఆయనకు డమ్మీ అభ్యర్థిగా అదే పార్టీ నుంచి నిలబెట్టిన నిత్య అనే మహిళ వేసిన నామినేషన్ పత్రాలు కూడా ఇదే కారణంతో తిరస్కరణకు గురికావడంతో ఎడప్పాడి బరిలో టీవీకే అభ్యర్థి లేకుండా పోయారు.

వాస్తవానికి రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్థానాల్లో ఎడప్పాడి ఒకటి. ఇక్కడ నుంచి ఈపీఎస్ మరోసారి భారీ మెజారిటీతో గెలవాలని చూస్తున్నారు. ఇలాంటి కీలక స్థానంలో విజయ్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టి పోటీని ఆసక్తికరంగా మారుస్తుందని అందరూ భావించారు. కానీ, చిన్న పొరపాట్ల వల్ల ఆ పార్టీ అభ్యర్థి రేసు నుంచి తప్పుకోవాల్సి రావడంతో విజయ్ అభిమానులు, పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నారు. నామినేషన్ తిరస్కరణకు గురైన తర్వాత అభ్యర్థి అరుణ్ కుమార్ కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది. తమిళనాడు అసెంబ్లీలోని 234 స్థానాల్లో పోటీ చేయాలని భావించిన టీవీకేకు, ఈ ‘ఎడప్పాడి’ షాక్ ఒక పాఠం వంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ స్థానంలో విజయ్ తన మద్దతును ఎవరికి ప్రకటిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

READ ALSO: Amazon Layoffs: భయంలో టెక్కీలు.. అమెజాన్‌లో 14,000 మందిపై వేటు?