Reading Time: 2 minutes
Yashasvi Jaiswal Reveals Smart Game Plan Vs Mi Ipl 2026 Match Winning Knock

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయాలు అందుకుంది. మంగళవారం రాత్రి గౌహతిలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ 27 పరుగుల తేడాతో గెలిచింది. రాజస్థాన్ విజయంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్ ప్లాన్‌పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవర్‌ప్లేలో తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేశాయని వెల్లడించాడు. ముందుగానే ప్లాన్ చేసి ముంబై బౌలర్లపై దాడి చేశామని చెప్పాడు. వైభవ్‌ సూర్యవంశీ, తాను లెక్కలేసుకొని మరీ చితకొట్టామని చెప్పుకొచ్చాడు.

‘పవర్‌ప్లేలో కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఉండటంతో నా మైండ్‌లో ముందుగానే ఒక ప్లాన్ వేసుకున్నా. ఏ ఓవర్లను టార్గెట్ చేయాలి, ఎవరిపై దాడి చేయాలి అన్నది ఆలోచించాను. దీపక్ చాహర్ బౌలింగ్‌కు రాగానే అతడిపై దాడి చేయొచ్చని అనుకున్నాను. తర్వాత జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కు వచ్చాడు. బుమ్రాను వైభవ్ టార్గెట్ చేస్తే బాగుంటుంది, నేను ఇంకొకరిని చూసుకుంటాను అని అనుకున్నాను. ఇలా ఎవరిపై దాడి చేయాలి, ఏ షాట్లు ఆడాలి అన్నది నిరంతరం ఆలోచిస్తూ మ్యాచ్‌లో పూర్తిగా ఫోకస్ పెట్టాను. మూడు ఫార్మాట్లలో ఆడడం అంత ఈజీ కాదు. కానీ ప్రతి సారి నా ప్రిపరేషన్‌లో నేను ఎలా మెరుగుపడాలో, ఏమి చేయాలో అని ఆలోచిస్తాను. నా షాట్లను మేరుపర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రతి వికెట్‌కు ఏ షాట్లు సరిపోతాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నేను ప్రాక్టీస్ చేసి.. వాటినే మ్యాచులో ఆడుతా’ అని యశస్వి జైస్వాల్ చెప్పాడు.

Also Read: TVK Chief Vijay: టీవీకే విజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ పార్టీ మనతోనే..!

‘ముందే వేసుకున్న ప్లాన్‌తో పాటు పరిస్థితిని అర్థం చేసుకుని షాట్లు ఆడతాను. జట్టుకు ఏం అవసరమో అదే చేయాలని చూస్తాను. నా ఆటను ఎప్పటికప్పుడు మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఏ షాట్ అవసరమో దాన్ని ఆడేందుకు ప్రయత్నిస్తాను. జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యం. వైభవ్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు చాలా కష్టపడుతున్నాడు. అతన్ని చూసి నేను కూడా ప్రేరణ పొందుతున్నాను. మేము తరచూ మాట్లాడుకుంటూ ఎలా ఆడాలి అనే విషయంపై చర్చిస్తుంటాం. నువ్వు ఫ్రీగా ఆడు అని నేను ప్రోత్సహిస్తాను. వైభవ్ ఆటను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఎవరి సలహాలు అవసరం లేకుండా తనంతట తానే అద్భుతంగా ఆడగలడు’ అని జైస్వాల్ చెప్పుకొచ్చాడు.