Reading Time: < 1 minute
Rr Vs Mi Ipl 2026 Match Result Vaibhav Suryavanshi Vs Bumrah Highlights

Vaibhav vs Bumrah: నిన్న గువహటి వేదికగా ముంబై ఇండియన్స్(MI), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ఓవర్లు తగ్గినా మ్యాచ్‌లో ఉత్సాహం మాత్రం అస్సలు తగ్గలేదు. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన జస్ప్రీత్ బుమ్రా VS వైభవ్ సూర్యవంశీ పోరు క్రికెట్ ప్రియులకు కనువిందు చేసింది. ఈ 15 ఏళ్ల కుర్రాడు రెండో ఓవర్‌లో బుమ్రా వేసిన ఫస్ట్ బాల్‌నే బౌండరీకి పంపాడు. బుమ్రా వేసిన ఆ లూజ్ డెలివరీని సరిగ్గా వాడుకున్న సూర్యవంశీ, లాంగ్-ఆన్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. దానికి బుమ్రా కేవలం చిరునవ్వు నవ్వి తన మార్క్ వైపు వెనుదిరిగాడు. కానీ ఆట అక్కడితో ఆగలేదు. అదే ఓవర్ నాలుగో బంతికి బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా సూర్యవంశీ మరో సిక్సర్ బాదాడు. ఇప్పటికే భయం, బెదురు లేకుండా అందరి ఓవర్లలో సిక్సర్ల మోత మోగించిన వైభవ్.. చివరికి ప్రపంచం మెచ్చిన యార్కర్ కింగ్ బుమ్రా బౌలింగ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించాడు. చివరకు రైట్ ఆర్మ్ పేసర్ శార్దూల్ ఠాకూర్ ఓవర్‌లో అవుట్ అయ్యాడు. అయితే.. ఇది చరిత్రలో నిలిచిపోయే యంగ్ స్టార్ ఫైట్‌గా మారనుంది.

READ MORE: Sumanth: మృణాల్‌కు క్షమాపణలు చెప్పిన సుమంత్..!

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం ప్రభావం ఉన్న మ్యాచ్‌లలో లక్ష్యంపై స్పష్టత ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కానీ.. ఈ మ్యాచ్‌లో ముంబై చిత్తుగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ యువ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించడం, జైస్వాల్ 77 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్లలో 150/3 పరుగులు చేసింది. రాజస్థాన్ అందించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆఖరి ఓవర్‌లో 35 పరుగులు కావాల్సి ఉండగా ముంబై 7 పరుగులు మాత్రమే చేసింది. 11 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 123/9 పరుగులు చేయడంతో రాజస్థాన్ 27 పరుగుల తేడాతో గెలిచింది.