Reading Time: < 1 minute

తిరుపతి పేరు వాడుకుని ఏం పనుల్రా ఇవి.. ఇవన్నీ ఫేక్.. నమ్మొద్దని పోలీసుల సూచన

Caption of Image.

తిరుపతి: తిరుపతిలో డేటింగ్ సర్వీస్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సూచించారు. తిరుపతిలో ఇలాంటి సర్వీస్లు అందుబాటులో ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్న ఫేస్‌బుక్ పోస్టులు పూర్తిగా అవాస్తవం అని ఆయన చెప్పారు.

తిరుపతి పేరును దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అసభ్యకర, తప్పుడు ప్రకటనలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇందులో ప్రచారం చేస్తున్న సమాచారం పూర్తిగా అవాస్తవం, నిరాధారం అని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసింది. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి.. ఈ నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు, పోస్టులపై సమగ్ర విచారణ చేపట్టాయి. 

►ALSO READ | సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ACP ఆఫీసులో లొంగిపోయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్

సంబంధిత వ్యక్తులను గుర్తించి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి నకిలీ ప్రకటనలు, ఫేక్ సోషల్ మీడియా ఖాతాలను చూసి ఎవరూ నమ్మవద్దని, వాటి ద్వారా ఎటువంటి లావాదేవీలు చేయవద్దని తిరుపతి జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

అనుమానాస్పద సోషల్ మీడియా పోస్టులు లేదా ఖాతాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-112కు సమాచారం అందించాలని కోరుతున్నారు. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసి ప్రజలను మోసగించే వ్యక్తులపై చట్టపరంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని, ఇలాంటి నేరాలను అరికట్టేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.