
ఐదేళ్ల క్రితం వరకు హైదరాబాద్ వైభవం మొత్తం రియల్ ఎస్టేట్‌లోనే కనిపించేది. కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టుపక్కల కావచ్చు.. చిన్న చిన్న కాలనీలు చూసినా.. సగం కట్టి వదిలేసిన నిర్మాణాలు, నత్తనడకన సాగుతున్న కన్‌స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ చూస్తుంటే రియల్ రంగం ఎలా కుదేలయిపోయిందో అర్ధమవుతుంది. ఒక ప్రముఖ కన్‌స్ట్రక్షన్ సంస్థలో నెలకి నాలుగు అపార్ట్‌మెంట్లు కూడా కొనేవాళ్లు లేరు. బిల్డర్లు నిర్మాణాలు ఆపలేరు. అలా అని కట్టలేరు. రొటేషన్ మొత్తం కుప్పకూలిపోయింది. ఏదో ఒక రోజు రియల్ ఎస్టేట్ లేవకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. భూములు, స్థలాలు ధరలు కూడా దారుణంగా పడిపోయాయి. భూముల ధరలు ఇప్పట్లో పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న ఫ్లాట్లు అమ్ముడుపోతేనే.. కొత్తగా కన్‌స్ట్రక్షన్ మొదలవుతుంది. అలా కన్‌స్ట్రక్షన్ పుంజుకున్నప్పుడే కొత్తగా భూముల అవసరం వస్తుంది. అప్పుడు మాత్రమే భూములకు డిమాండ్ వచ్చి రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే అమ్మేవాడు లేడు. కొనేవాడు లేడు. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగాల్లో రియల్ ఎస్టేట్ కూడా ఒకటి. అలాంటి రియల్ ఎస్టేట్ ను కరోనా గట్టి దెబ్బ కొట్టింది. కరోనా వచ్చినప్పట్నుంచీ రియల్ ఎస్టేట్ పూర్తిగా పడకేసింది. రియల్ ఎస్టేట్ కేవలం హైదరాబాద్ లోనే కాదు.. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి దేశంలో మెట్రో నగరాలతో పాటు యూనివర్సల్‌గానూ కుదేలైపోయింది. ఈ విషయాన్ని మేం ఐదారేళ్ల క్రితం నుంచి చెబుతూనే ఉన్నాం. అయినా సరే కొందరు బిల్డర్లు గుడ్డిగా నిర్మాణాలు చేసుకుంటూ పోయారు. ఇప్పుడు సంక్షోభాన్ని కొనితెచ్చుకున్నారు. పైగా ఎప్పటికైనా కరోనా ముందు నాటి పరిస్థితులు వస్తాయని రియల్టర్లు ఎదురుచూడటమే కానీ.. మార్కెట్ మాత్రం స్తబ్ధుగానే ఉంది. ఏళ్లు గడుస్తున్నాయి కానీ.. రియల్ ఎస్టేట్ మాత్రం పుంజుకోవడం లేదు.
హైదరాబాద్ లో 4 కోట్ల ఎస్‌ఎఫ్‌టీ కమర్షియల్ స్పేస్ ఖాళీగా పడుంది. అలాగే 3 కోట్ల ఎస్‌ఎఫ్‌టీ రెసిడెన్షియల్ స్పేస్ కూడా ఖాళీగానే ఉంది. దీంతో చిన్నా, పెద్దా బిల్డర్లంతా కొత్త నిర్మాణాలు పూర్తిగా నిలిపేశారు. పెద్ద సంస్థలు కూడా సిబ్బందికి వేతనాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయి. వందకు 2 రూపాయలు వడ్డీలకు తెచ్చి.. నిర్మాణాలు చేయలేక.. అప్పులు తీర్చలేక రియల్డర్లు బిక్కచూపులు చూస్తున్నారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ మాత్రం మెరుగవడంలేదు. ఏళ్లు గడుస్తున్నా ఎక్కడా పుంజుకున్న దాఖలాలు కనిపించడం లేదు. 2021లో మొదలైన రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్.. ఇంకా కొనసాగుతోంది. అప్పులు తెచ్చి మరీ ఎడాపెడా నిర్మాణాలు చేసిన బిల్డర్లకు.. ఇప్పుడు రక్తకన్నీరే మిగులుతోంది. పూర్తిచేసిన ప్రాజెక్టులే పూర్తిగా అమ్ముడుపోకపోవడంతో.. కొత్త ప్రాజెక్టుల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఇదేదో చిన్నా చితకా బిల్డర్ల దుస్థితి మాత్రమే. పెద్ద సంస్థలు పర్వాలేదనే ధోరణి కూడా ఏం లేదు. ఇక్కడ చిన్నా.. పెద్దా తేడా లేకుండా మొత్తంగా బిల్డర్లందరికీ అదే వ్యథ.
ఎవరేమనుకున్నా.. కొన్నాళ్ల పాటు రియల్ ఎస్టేట్ లో బూమ్ ఉందని కృత్రిమ డబ్బా కొట్టుకున్న బిల్డర్లకు కూడా ఇప్పుడిప్పుడే వాస్తవాలు బోధపడుతున్నాయి. మొన్నటిదాకా గాల్లో మేడలు కట్టినవాళ్లు.. ఇప్పుడు అమాంతం గొయ్యిలో పడ్డట్టుగా ఫీలవుతున్నారు. అసలు రియల్ ఎస్టేట్‌లో వాస్తవ పరిస్థితిని అంగీకరించటానికి కూడా నిన్నటిదాకా ముందుకు రాని కొందరు బిల్డర్లు కూడా ఇప్పుడు చేసేదేమీ లేక వాస్తవాలు ఒప్పుకుంటున్నారు. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఫలితం ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి చాలా కారణాలున్నాయి. ఇక్కడ అవసరానికి మించి నిర్మాణాలు జరిగిపోయాయి. జనం అవసరాలను దాటి కన్‌స్ట్రక్షన్ పెరిగింది. సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్ అందరూ చేయలేరు. కొత్త కన్‌స్ట్రక్షన్‌కి సమాచారం కోసం వచ్చేవాళ్లే లేరు. జనంలో కొనుగోళ్ల సామర్థ్యం తగ్గింది. ఆసక్తి తగ్గింది. సెకండ్ హ్యాండ్ సేల్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా వరకు కమర్షియల్ నిర్మాణాలు నిలిచిపోయాయి.
ముడి సరుకు. సిమెంట్, స్టీలు వంటివాటి ధరలు, లేబర్ చార్జీలు పెరిగిపోవడంతో బిల్డర్లు అపార్టుమెంట్ల ధరలను అమాంతం పెంచేశారు. ఆకాశాన్ని అంటుతున్న ధరలను చూసి కొనుగోలుదారులు వెనక్కి తగ్గారు. బిల్డర్లు, ప్రైవేటు పెట్టుబడిదారులకు కూడా సమయానికి సొమ్ము రాక నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేశారు. రియల్ ఎస్టేట్ రంగం తిరిగి నిస్తేజంగా మారింది. మొత్తం మీద కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి గ్రహణం పట్టిందనే చెప్పాలి. ఇక్కడ సహజసిద్ధమైన కారణాలు కొన్నైతే.. బిల్డర్లు అత్యాశకు పోయి తెచ్చుకున్న సంక్షోభం మరికొంత అని చెబుతున్నారు. కస్టమర్లు సొంతింటి కోసం ఆరాటపడినప్పుడు..వారిని పట్టించుకోని బిల్డర్లు.. ఇప్పుడు అసలు కస్టమర్లే రావడం లేదని నిట్టూరుస్తున్నారు. మధ్యలో కొన్నాళ్లు రియల్ మందగమనానికి తాము కారణం కాదని బుకాయించే ప్రయత్నం చేసినా.. ఆ పప్పులు కూడా ఉడకలేదు. ఏతావాతా రియల్ ఎస్టేట్ పతనానికి రియల్టర్లే ప్రధాన కారణం.
ఆ మాటకొస్తే.. రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభం మొదటిగా చిన్న బిల్డర్లను దెబ్బకొట్టింది. ఆ తర్వాత మధ్యస్థాయి బిల్డర్లు.. చివరిగా పెద్ద బిల్డర్లకు సెగ తగిలింది. అంటే ఇదేదో తెల్లారేసరికి వచ్చిపడ్డ సంక్షోభం ఏమీ కాదు. క్రమంగా సంక్షోభం విస్తరిస్తూపోయింది. ముందే మేలుకుంటే.. తక్కువ నష్టంతో బయటపడే అవకాశాలున్నా.. బిల్డర్లు మాత్రం చాలా ఆలస్యం చేసేసారు. ముందుగా చిన్న బిల్డర్లు మునిగిపోతుంటే.. మిగతా బిల్డర్లు చోద్యం చూశారు. పైగా వారికి వ్యాపారం చేయడం చేతకాక దివాలా తీస్తున్నారని సెటైర్లు వేశారు. అంతేకానీ ఈ సంక్షోభం ముందూ వెనుకగా అందర్నీ చుట్టేస్తుందని గ్రహించలేకపోయారు. పోనీ మధ్యస్థాయి బిల్డర్లు ఇబ్బందిపడుతున్నప్పుడైనా అర్థం చేసుకున్నారా.. అంటే అదీ లేదు. అప్పుడు కూడా ప్రొఫెషనల్‌గా బిజినెస్ చేసే తమకు రాని ఇబ్బంది.. సరైన వ్యాపార ప్రమాణాలు పాటించకపోవడం వల్లే మిగతా బిల్డర్లకు వచ్చిందని పెద్ద సంస్థలు గప్పాలు కొట్టాయి. కానీ చివరకు వారికీ సెగ తగిలింది. ఇప్పుడు బిల్డర్లందర్నీ చుట్టేసిన రియల్ మందగమనం.. మొత్తంగా రియల్ ఎస్టేట్ రంగాన్నే కుదేలు చేసింది.
ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే.. సంక్షోభానికి అసలు కారణం ఏంటో తెలిసినా కూడా బిల్డర్లు ఏమీ తెలియనట్టే నటిస్తున్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మాణాలు చేసినా ఖర్చు చదరపు అడుగుకి రూ.3500కు మించదు. మరో రూ.1500 భూమి ధర వేసుకున్నా.. చదరపు అడుగు రూ.5 వేలకు అమ్మొచ్చు. పోనీ మరో వెయ్యి లాభం వేసుకుని రూ.6 వేలకు అమ్మొచ్చు. దీన్ని సరసమైన ధరగా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా చదరపు అడుగు నిర్మాణ ధర రూ.10 నుంచి 15 వేలు చెబుతున్నారు. ఈ స్థాయిలో లాభాల కోసం అధికంగా రేట్లు పెంచేయడంతో.. కస్టమర్లు భయపడి దూరమయ్యారు. ముఖ్యంగా మధ్యతరగతి జనం అపార్ట్‌మెంట్ కొనాలంటే భయపడిపోతున్నారు.
సాధారణంగా రియల్ మార్కెట్‌కు మధ్యతరగతే మహారాజపోషకులు. కానీ ఇప్పుడు వారు కూడా విపరీతమైన రేట్లు చూసి ఠారెత్తిపోయి.. సొంతింటికి దూరం జరిగారు. ఒకప్పుడు ప్రతి మధ్య తరగతి కుటుంబ లక్ష్యాల్లో కచ్చితంగా సొంతింటికి పెద్ద పీట ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మధ్యతరగతే కాదు ఎగువ మధ్యతరగతి కూడా తమ కుటుంబ లక్ష్యాల నుంచి సొంతింటిని తొలగించారంటే అతిశయోక్తి కానే కాదు. ఎందుకంటే 2 వేల చదరపు అడుగుల ఫ్లాట్ ధర రూ.2 కోట్లకు తక్కువ లేదు. ఇక్కడ రూ. 50 లక్షలు డౌన్ పేమెంట్ చేసినా.. మరో రూ.1.5 కోట్లకు బ్యాంక్ లోన్‌కు వెళ్లాల్సిందే. అప్పుడు ఈఎంఐ ఎంత లేదన్నా రూ. లక్షన్నర పడుతుంది. ఈ ఎంఐఎంలోనూ 90 శాతం అంటే రూ. 1.45 లక్షలు వడ్డీకే పోతుంది. అంటే ఎలాగో తిప్పలు పడి నెల నెలా లక్షన్నర రూపాయల ఈఎంఐ కట్టినా.. అక్కడ అసలు తీరేది ఐదు వేల రూపాయలే. ఈ లెక్కన మొత్తం అప్పు తీరటానికి ఎంతకాలం పడుతుంది..? ఇది మన వల్ల అయ్యే పనేనా..? అని మధ్యతరగతి ముందే హ్యాండ్సప్ చెప్పేస్తోంది.
ఇప్పుడు మనం ఓసారి నగరంలో మధ్యతరగతి ఆదాయం, ఖర్చుల సంగతి చూద్దాం. మొదటిగా నెలకు రూ. లక్ష జీతం తెచ్చుకునే వాడి ఆదాయవ్యయాలు పరిశీలిస్తే.. నెలకు రూ.50 వేలు ఇంటి ఖర్చు ఉంటుందనుకుంటే.. మిగిలే రూ.50 వేలతో ఇల్లు కొనడం సాధ్యమేనా..? అనేది మౌలికమైన ప్రశ్న. పోనీ మధ్యతరగతి వాడిని వదిలేద్దాం. నెలకు రూ. 2 లక్షలు తెచ్చుకునే ఎగువ మధ్యతరగతి వాడికైనా ఇంతింత రేట్లు పెట్టి ఇల్లు కొనడం సాధ్యమా..? అంటే కాదనే చెప్పాలి. ఈ కారణంతోనే మిడిల్ క్లాస్ రియల్ ఎస్టేట్ మాటెత్తితేనే ఆమడదూరం పరిగెడుతోంది. అసలు ఈ వైపు చూస్తేనే.. బిల్డర్లు ఏదోలా ఫ్లాట్లు అండగడతారేమోనని.. అసలీవైపు రావడమే మానేశారు మధ్యతరగతి జీవులు. అందుకే అమ్మకాల సంగతి తర్వాత కనీసం ఎంక్వైరీలు కూడా రావడం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి.
రియల్ ఎస్టేట్ పడిపోవటానికి ప్రధాన కారణం అధిక ధరలే. కృత్రిమ బూమ్ సృష్టించి.. కళ్లు చెదిరే ధరలు చెబుతున్న బిల్డర్ల ఎత్తులు ఎదురుతన్నాయి. కనీవినీ ఎరుగని రేట్లు చూసి.. మార్కెట్‌కు మిడిల్ క్లాస్ దూరమైపోయారు. అసలు సొంతింటి ఆలోచనే మానేశారు. దీంతో అసలుకు ఎసరొచ్చింది. రియల్ ఎస్టేట్ కు ఎప్పుడైనా కొనుగోలుదారులే మహారాజపోషకులు. కస్టమర్స్ ఆదరణ బాగుంటేనే.. రియల్ ఎస్టేట్ పచ్చగా ఉంటుంది. కొన్నాళ్లుగా సగటు వేతనాలు తగ్గాయి. జీతాల్లో వృద్ధి కూడా పెద్దగా లేదు. దీంతో కనీస అవసరాలు తీర్చుకోవడమే కష్టమైపోతోంది. ఇక ఇంటి గురించి ఆలోచించేదెలాగనేది సామాన్యుడి ప్రశ్న. అన్నింటికంటే కీలకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం. ఏ దేశంలోనూ ఆర్థిక వ్యవస్థ చక్కగా లేదు. ఉద్యోగాల్లోనూ అస్థిరత కొనసాగుతోంది. ఉద్యోగి సగటు ఆదాయం ఎక్కడా పెరగలేదు. దీంతో సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఇవన్నీ బేరీజు వేసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ధరల్ని ఆకాశంలోకి తీసుకెళ్లారు. నిత్యావసరాలే ఆచితూచి కొనుగోలు చేస్తున్న జనం.. అధిక రేట్లు పెట్టి ఫ్లాట్లు ఎలా కొంటారనే కనీస ఆలోచన చేయకోపోవడం స్తబ్ధతను కొనితెచ్చినట్టైంది. కనీసం మార్కెట్ కు తగ్గట్టుగా అయినా స్పందించాలి. కొనుగోళ్లు లేనప్పుడు రేట్లు తగ్గిస్తే.. ఎంతోకొంత అమ్మకాలు జరుగుతాయి. కానీ ఎవరూ రేట్లు తగ్గించుకోవటానికి ముందుకు రావడం లేదు. దానికి ఎవరి కారణాలు వారికున్నాయి. అధిక రేట్లకు భూములు కొని తక్కువ రేట్లకు ఎలా అమ్మగలమని ప్రశ్నిస్తున్నారు. మరి అసలు ఆదాయమే పెరగకుండా ఎక్కడ డబ్బు తెచ్చి..అధిక రేట్లకు ఫ్లాట్లు కొనాలని సామాన్యులు నిలదీస్తున్నారు. ఇలా ఒకటికి మించిన కారణాలతో రియల్ ఎస్టేట్ పుంజుకోవటం లేదు. మొత్తం మీద అందుబాటు రేట్లు మార్కెట్ పుంజుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు. మార్కెట్ ఎప్పుడూ సామాన్యుడికి అందుబాటులో ఉండాలనేది ప్రాథమిక సూత్రం. కానీ కొంతకాలంగా రియల్ మార్కెట్ ఊహాజనితంగా కొండకు వెంట్రుకేసి లాగే ప్రయత్నమే చేస్తోంది. సామాన్యుల అవసరాలు, స్థితిగతులు పట్టించుకోకుండా ప్రీమియం మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేసుకుంటూ పోయారు. హైదరాబాద్ జనంలో ఎంతమంది ప్రీమియం రేట్లు భరించగలరు అనే ఆలోచన చేయలేదు. 90 శాతం మందికి అందుబాటు రేట్లు కావాలనే విషయం పూర్తిగా మర్చిపోయారు.
అదే సమయంలో సింగిల్ ఇన్వెస్ట్ మెంట్లు దాదాపుగా పూర్తైపోయాయి. ఇప్పుడు రెండు, మూడు ఇన్వెస్ట్ మెంట్లు పెట్టగలిగే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అసలే జనం దగ్గర డబ్బుల్లేవు. ఆదాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. జీతాల్లో వృద్ధి కనిపించటం లేదు. కనీసం మంచిరోజులు ఎప్పుడొస్తాయో కూడా తెలియటం లేదు. అలాగని హైదరాబాద్ లో ఇళ్లు కావాల్సిన వాళ్లు లేరని కాదు. వారి కెపాసిటీకి, మార్కెట్లో ఉన్న ధరలకు పొంతన కుదరటం లేదు. దీంతో అంతంత ధరలు పెట్టి ఇల్లు కొనలేం లే అని మధ్యతరగతి అద్దె ఇంటితోనే సరిపెట్టుకుంటోంది.
మిగతా మార్కెట్లతో పోలిస్తే రియల్ ఎస్టేట్ డైనమిక్ మార్కెట్. ఈ సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ రోజువారీ వ్యూహాలదే కీలక పాత్ర. అవసరమైతే పూటకో ఆలోచనతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మారే కొనుగోలుదారుల అవసరాల్ని వేగంగా బేరీజు వేయాలి. కొత్త ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు అన్నిరకాలుగా ఆలోచించి ముందుకెళ్లాలి. ప్లాన్ బీ లేకుండా అడుగు ముందుకు వేయకూడదు. హైదరాబాద్ లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నా.. రేట్లు తగ్గించడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు. ధరలు తగ్గిస్తే తమ బ్రాండ్ నేమ్ పడిపోతుందని పెద్ద కంపెనీలు భావిస్తున్నాయి. చిన్న కంపెనీలు కూడా తామెందుకు తగ్గించాలనే ధోరణితో వేచి చూస్తున్నాయి. అనధికారికంగా ఏవో కొన్ని ఆఫర్లు ఇస్తున్నా.. అవి కొనుగోలుదారుల్ని ఆకట్టుకునే రేంజ్ లో అయితే లేవనే చెప్పాలి.
సొంతిల్లు కోసం చూసేవారికంటే.. పెట్టుబడులు పెట్టేవారే రియల్ మార్కెట్ కు కీలకం. కానీ ఇప్పుడు సెకండ్ ఇన్వెస్ట్ మెంట్ పెట్టేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అద్దెలతో పోలిస్తే ఈఎంఐ భారంగా మారడంతో ఇళ్ల కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇళ్లు కొనేవారు లేక, ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు వెనక్కిరాక.. రియల్ కంపెనీలు కష్టాలు పడుతున్నాయి. ఎప్పటికైనా రియల్ ఎస్టేట్ లో కదలిక రావాలంటే.. రియల్టర్లు ధరల తగ్గింపుపై దృష్టి పెట్టాల్సిందే. ఏమైనా ధరలు తగ్గించి అమ్మితే.. మార్కెట్లో కాస్త కదలిక రావచ్చు. లేకపోతే మాత్రం సేమ్ సీన్ కొనసాగతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఏ బిజినెస్ లో అయినా క్యాష్ ఫ్లో కీలకం. రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్ కావడంతో.. ఈ సెక్టార్లో మనీ సర్క్యులేషన్ ఆగిపోయింది. ఇది పెట్టుబడి పెట్టిన బిల్డర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక్కడ డబ్బు విలువ కనిపిస్తోంది కానీ.. డబ్బు ఎవరికీ కనిపించడం లేదు. డబ్బు ఎక్కడికక్కడ ఇరుక్కుపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడులపై లాభం సంగతి తర్వాత అసలు కూడా గిట్టుబాటు కావడం లేదని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ బిజినెస్ కోసం మేము ఇప్పటికిప్పుడు ఇల్లు కొనే పరిస్థితిలో లేమని కొనుగోలుదారులు తేల్చిచెప్పేస్తున్నారు.
సొంతిల్లు అందరికీ కలే. కానీ దాని కోసం నేల విడిచి సాము చేయటానికి ఎవరూ సిద్ధంగా లేరు. ధైర్యం చేసి బ్యాంక్ లోన్ తీసుకోవటానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. మొత్తం మీద అధిక ధరలు సామాన్యుడికి సొంతింటిపై ఉండే మోజును చంపేశాయనడంలో సందేహం లేదు. అసలు రియల్ ఎస్టేట్ ఎప్పుడూ సామాన్యుడికి బ్రహ్మపదార్థమే. అంత త్వరగా అందరికీ కొరుకొడుపడే వ్యవహారం కాదు. మొదట్లో సొంతిల్లు ఉండాలనే సెంటిమెంట్ తో జోరందుకున్న రియల్ ఎస్టేట్.. క్రమంగా ఇన్వెస్ట్ మెంట్ కు బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. అంతేకాకుండా ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు సామాన్యుల్లో కూడా రియల్ ఎస్టేట్ పై అవగాహన పెరిగిన మాట నిజం. పదేళ్ల క్రితంతో పోలిస్తే.. ఎస్ఎఫ్టీ, ఫ్లాట్ , బిల్డప్ ఏరియా లాంటి పదాలు చాలా మందికి అర్థమౌతున్నాయి. చదరపు అడగు రేటు ఎలా ఫిక్స్ చేస్తారు.. ఎవరు ఫిక్స్ చేస్తారు.. ఈ రేటు ఎప్పుడు ఎలా మారుతుంది లాంటి కొన్ని విషయాలు మాత్రం ఇంకా అందరికీ అర్థమయ్యే పరిస్థితి లేదు. మొదట్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న భూముల విలువ ఆధారంగా ఈ చదరపు అడుగు రేటు ఫిక్స్ చేసేవాళ్లు. కాలక్రమంలో నిర్మాణ ప్రమాణాల్ని బట్టి రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవలి కాలంలో ఆ ట్రెండ్ బాగా పెరిగింది. ఈ అనారోగ్యకర పరిణామాలే ఇళ్ల విక్రయాలు మందగించడానికి కారణమనే వాదన వినిపిస్తోంది.
రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా పెరుగుతూ పోతే.. దాని వృద్ధికి ఢోకా లేదని భావించాలి. కానీ ఒక్కసారిగా వచ్చిన బూమ్.. కచ్చితంగా ఎప్పుడోసారి బరస్ట్ అవుతుందనే ఆందోళన ఉంటుంది.డిమాండ్ బాగున్నప్పుడు ఎడాపెడా రేట్లు పెంచినా పెద్ద ఇబ్బంది కాలేదు. కానీ ఎప్పుడైతే ఫ్లాట్ల కోసం ఎంక్వైరీలు తగ్గాయో.. నిర్మాణాలు పూర్తై ఏళ్లు గడుస్తున్నా.. వందల సంఖ్యలో ఫ్లాట్లు ఖాళీగా ఉంటున్నాయో.. అప్పుడు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. గతంలో తమ టార్గెట్లను ఈజీగా రీచైన సీనియర్ మార్కెటింగ్ ఏజెంట్లు కూడా ఇప్పుడు ఫ్లాట్లు అమ్మడానికి అష్టకష్టాలు పడుతున్నారు. చాలా కష్టపడి కస్టమర్లను సైట్ కు తీసుకొచ్చినా.. వారితో ఇల్లు కొనిపించేసరికి తల ప్రాణం తోకకు వస్తుందని చెబుతున్నారు.అసలిలా రావటానికి కూడా ఇప్పుడెవరూ సిద్ధంగా లేరంటే రియల్ పిక్చర్ ఏంటో స్పష్టంగా అర్ధమవుతోంది.