Reading Time: 2 minutes
Cyberabad Traffic Action Plan Monsoon

Monsoon Traffic : వర్షాకాలంలో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. నగరవ్యాప్తంగా వర్షపు నీరు నిలిచే (వాటర్ లాగింగ్) ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, జీహెచ్‌ఎంసీ తదితర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగస్వాములవుతున్న గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన సుమారు 150 మంది సిబ్బంది విధులను సమీక్షించిన ఆయన, వర్షాల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ తక్షణమే స్పందించేలా పలు మార్గదర్శకాలు జారీ చేశారు.

రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు.. వాటర్ లాగింగ్‌కు శాశ్వత పరిష్కారం

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సీపీ అధికారులకు సూచించారు. ముఖ్యంగా జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌లు, యూ-టర్న్‌లను అడ్డుకుంటూ వాహనాలను నిలిపేవారిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. రాంగ్ రూట్‌లో వచ్చే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించాలని ఆదేశించారు. అలాగే, నీరు నిలిచే సమస్య తరచూ ఎదురయ్యే బ్లాక్ స్పాట్స్ (Water Logging Areas) పై ఒక సమగ్ర మాస్టర్ డాక్యుమెంట్ సిద్ధం చేసి, ఆయా ప్రాంతాల్లో సమస్యల నివారణకు శాశ్వత పరిష్కార మార్గాలు కనుగొనాలని స్పష్టం చేశారు.

రోడ్డు కటింగ్‌లపై సమన్వయం.. ఆ జంక్షన్లలో పనులు వేగవంతం

నగరంలో ఎక్కడైనా రోడ్డు కటింగ్ పనులు చేపట్టే ముందు సంబంధిత సంస్థలు తప్పనిసరిగా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని, ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపు (Divertion) ప్రణాళికలను అమలు చేయాలని సీపీ సూచించారు. ఐటీ కారిడార్ పరిధిలోని విప్రో జంక్షన్, డీఎల్‌ఎఫ్ జంక్షన్లతో పాటు షాపూర్ నగర్, కూకట్‌పల్లి వై-జంక్షన్, మియాపూర్, నిజాంపేట్ ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. వర్షాకాలం దృష్ట్యా ఈ పనులన్నింటినీ వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

రాత్రి విధుల్లో జాగ్రత్తలు.. సిబ్బందికి అలర్ట్

రాత్రి వేళల్లో , వర్షంలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, వారు విధిగా రిఫ్లెక్టివ్ జాకెట్లు, రెయిన్ కోట్లు ధరించాలని కమిషనర్ ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి అంతరాయం లేని, సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో అన్ని విభాగాలు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, ట్రాఫిక్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీపీ గట్టిగా హెచ్చరించారు.