Reading Time: < 1 minute

ఉద్యోగులకు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్.. 1,998 వ్యాధులకు 652 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స

Caption of Image.
  • దేశంలోనే తొలిసారిగా రూ. 1.20 కోట్ల సమగ్ర ప్రమాద బీమా
  • అంగన్​వాడీ టీచర్లు రిటైర్ అయితే రూ.2 లక్షల ఆర్థిక సాయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దశాబ్దాల కలలను నెరవేరుస్తూ ప్రభుత్వం సంక్షేమ రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ భద్రత, భరోసా కల్పించడమే ధ్యేయంగా క్యాష్​లెస్ హెల్త్ స్కీంకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు కానున్న ఈ పథకం కింద 1,998 రకాల వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు అందనున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానెల్ ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయడం ద్వారా సుమారు 23 లక్షల 51 వేల మందికి లబ్ధి చేకూరనుంది. అదే సమయంలో ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఒక సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. విధి నిర్వహణలో ఉన్నా లేదా బయట ఉన్నా, ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి రూ. 1.20 కోట్ల భారీ బీమా సొమ్ము అందేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. దీంతో పాటు 60 ఏళ్ల వయసు వరకు ఉన్న వారికి రూ.10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌‌ను వర్తింపజేస్తున్నది. ఒకవేళ విమాన ప్రమాదంలో మరణిస్తే అదనంగా మరో రూ.2 కోట్ల కవరేజీ లభించేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దింది. 

ఈ  నిర్ణయంతో రాష్ట్రంలోని 7 లక్షల 57 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొండంత అండ లభించినట్లయింది. మరోవైపు అంగన్​వాడీ సిబ్బంది పదవీ విరమణ పొందినప్పుడు వారికి ఇచ్చే ప్రయోజనాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పదవీ విరమణ చేసే అంగన్​వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందనుంది. 60 ఏళ్ల వయసులో స్వచ్ఛందంగా విధుల్లోంచి విరమించుకున్న వారికి కూడా ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.