Reading Time: < 1 minute
Tiger Movement Alert In Polavaram Fear Grips Tribal Villages In Andhra Pradesh

కాకినాడ జిల్లా అటవీ ప్రాంతాల నుంచి కదిలిన ఒక పెద్దపులి ప్రస్తుతం పోలవరం జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. రాజవొమ్మంగి మండలం ఉర్లకులపాడు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పులి సంచారం గుర్తించబడింది. బవురువాక, తడువాయి అడవుల మీదుగా ప్రయాణించిన ఈ పులి నాగులకొండ పర్వత శ్రేణి వరకు చేరినట్లు సమాచారం. అక్కడ సుమారు 10 కిలోమీటర్ల మేర పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు.

Also Read: Kandhalapalli News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన.. అంతిమయాత్రకు అడ్డంకులు, ఉద్రిక్తత!

పోలవరం డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ శివకుమార్ నేతృత్వంలో ప్రత్యేక “హనుమాన్” బృందాలు ఏర్పాటు చేసి పులి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రస్తుతం పులి తాను వచ్చిన దారిలోనే తిరిగి వెళ్తున్న అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు పశువులపై ఎలాంటి దాడులు జరగకపోవడం కొంత ఉపశమనం కలిగించినా.. సమీప గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ముందుజాగ్రత్త చర్యగా ఉర్లకులపాడు, వెంకట్ నగర్, చెరువుకొమ్ముపాలెం, గొల్లవారి వీధి, కొత్తంపాలెం సహా 15కి పైగా గ్రామాలకు అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.