Reading Time: < 1 minute

టీం ఇండియా గత కొంతకాలంగా మంచి జోష్‌లో ఉంది. 2023లో జరిగినవన్డే ప్రపంచకప్‌లో ఓటమిపాలైనా.. ఆ తర్వాతి సంవత్సరం (2024)లో టి-20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్, మళ్లీ ఈ ఏడాది టి-20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇక మహిళ జట్టు కూడా వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భారత జట్టు విజయాలకు ఇది ఆరంభం మాత్రమే అని అన్నాడు.

‘‘భారత్ వరుసగా అద్భుతాలు సాధించడం గర్వంగా ఉంది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో టీం ఇండియా ఆధిపత్యం కొనసాగుతోంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. మున్ముందు ఇదే దూకుడు కొనసాగుతుందని నమ్ముతున్నా. పురుషుల జట్లు వరుసగా రెండో టి-20 ప్రపంచకప్‌లను నెగ్గింది. అయితే మహిళ జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా.. తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను చూడటం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఒక్కసారి ఇలాంటి స్థితికి చేరుకున్నాక.. ముందుకు సాగిపోవాల్సిందే.. అందరిపై బాధ్యత ఇంకా పెరుగుతుంది’’ అని రోహిత్ అన్నాడు.