Reading Time: < 1 minute

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నమన్ అవార్డుల జాబితాను ప్రకటించింది. 2024-25 సీజన్‌కు సంబంధించి క్రికెట్‌లో క్రీడాకారుల ప్రదర్శనలు, సేవలను గుర్తించేందుకు బిసిసిఐ ఈ అవార్డులను ఇస్తుంది. తన వార్షిక ‘నమన్ అవార్డుల’ ప్రదానోత్సవాన్ని ఆదివారం, మార్చి 15న న్యూఢిల్లీలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ వేడుకలో అత్యున్నత పురస్కారాలు ముగ్గురు దిగ్గజాలకు దక్కనున్నాయి.  రాహుల్ ద్రవిడ్ , రోజర్ బిన్నీలకు కర్నల్ సి.కె. నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం.. మిథాలీ రాజ్‌కు ‘మహిళల విభాగంలో BCCI జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయనున్నారు.

రాహుల్ ద్రవిడ్, ఆటగాడిగా తన సుదీర్ఘ కెరీర్‌లో 24,000కు పైగా అంతర్జాతీయ పరుగులు సాధించారు. అంతేకాదు, టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తూ 2024లో ICC పురుషుల T20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలవడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఒక ప్లేయర్ గా, కోచ్ గా రాణించిన ద్రవిడ్.. భారత క్రికెట్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.

అలాగే, 1983లో భారత్ ప్రపంచ కప్ గెలుచుకున్న జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న బిన్నీ, ఆ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆయన కోచ్‌గా, సెలెక్టర్‌గా, నిర్వాహకుడిగా భారత క్రికెట్‌కు సేవలందించారు. ఇందులో 2022 నుండి 2025 వరకు BCCI అధ్యక్షుడిగా పనిచేశారు.

ఇక, మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు మిథాలీ తన పేరిట లిఖించుకున్నారు. ఆమె 50.68 సగటుతో మొత్తం 7,805 పరుగులు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో భారత జట్టును రెండుసార్లు ICC మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్‌కు తీసుకెళ్ళారు.