Reading Time: < 1 minute

టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా భారీ బహుమతి ప్రకటించింది. మొజ్తాబాను పట్టిస్తే రూ. 93 కోట్లు భారత్ కరెన్సీలో(పది మిలియన్ డాలర్లు) ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. అమెరికా విదేశాంగ శాఖ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. మొజ్తాబాతో పాటు అలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భ్రదతాధికారి అలీ లారిజానితో సహా పలువురు ఆచూకీ తెలిపితే తగిన బహుమతి ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసింది. ఆచూకీ తెలిపిన వారికి బహుమతితో పాటు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్ మూకమ్మడి దాడిలో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ హతమైన సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ వారసుడిగా ఖమేనీ ముజ్తాబాను ఎన్నికయ్యారు. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ముజ్తాబా ఎక్కడున్నారో తెలియడం లేదు.

అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్ లో 1444 మంది దుర్మరణం చెందారు. టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురుపిస్తున్నారు. మినాబ్ స్కూల్‌పై బాంబులతో దాడి చేయడంతో చాలా మంది పిల్లలు చనిపోయారు. ఈ ఘటనకు వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున గూమికూడి నిరసన తెలిపారు. ఖమేనీ చిత్రపటాలను చేతిలో పట్టుకొని ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ర్యాలీపై అమెరికా బాంబులు వేసినప్పటికి నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. పేలుళ్ల ఘటనలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. గల్ఫ్ దేశాలలో అమెరికా స్థావరాలపై ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీపా వద్ద కూడా ఇరాన్ డ్రోన్లు కూల్చివేసినట్లు సమాచారం. గల్ఫ్‌లోని చమురు క్షేత్రాల లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడంతో వాటిని సౌదీ వైమానిక బలగాలు కూల్చివేశాయి.