Reading Time: < 1 minute

ముంబై: త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 226పై గల్ఫ్ యుద్ధం ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గల్ఫ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. యుఎఇతో సహా పశ్చిమాసియాలోని పలు దేశాలపై ఇరాన్ వైమానిక దాడులతో విరుచు పడుతోంది. దీంతో దుబాయితో సహా రియాద్, దోహా, మస్కత్, కువైట్ తదితర నగరాల్లో పరిస్థితులు చేతులు దాటాయి. దీంతో ఈ నగరాలలోని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసి వేశారు. దీంతో దుబాయి తదితర ఎయిర్ పోర్ట్‌ల నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగోంది.

ఇటీవల భారత్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ తర్వాత స్వదేశానికి వెళ్లేందుకు వెస్టిండీస్, సౌతాఫ్రికా, జింబాబ్వే, ఇంగ్లండ్ తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొక తప్పలేదు. రోజుల తరబడి దుబాయిలోనే ఉండి పోవాల్సి వచ్చింది. కాగా, మరికొన్ని రోజుల్లోనే ఐపిఎల్ ప్రారంభం కావాల్సి ఉన్న సమయంలో గల్ఫ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నిర్వాహకులను కలవరానికి గురి చేస్తున్నాయి. విమానాల రాక పోకలపై అనిశ్చితి వాతావరణం నెలకొన్న సమయంలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, జింబాబ్వే తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు భారత్‌కు రావడం క్లిష్టంగా మారింది. టోర్నీప్రారంభానికి ముందు వీరి భారత్‌కు చేరుకుంటారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. దీనికి తోడు గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో భారత్‌లో తీవ్ర ఇంధన సమస్య నెలకొంది. పలు నగరాల్లో ఇప్పటికే హోటళ్లు మూత పడ్డాయి.

ఈ పరిస్థితుల్లో ఐపిఎల్‌లో పాల్గొనే క్రికెటర్లకు సౌకర్యాలు కల్పించడం నిర్వాహకులకు ఇబ్బందిగామారింది. పరిస్థితులు ఇలాగే ఉంటే ఐపిఎల్ సజావుగా సాగడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. కాగా, భారత క్రికెట్ బోర్డు మాత్రం ఐపిఎల్ ప్రారంభానికి ముందు యుద్ధం ఆగిపోతుందనే నమ్మకంతో ఉంది. త్వరలోనే పరిస్థితులు మాములుగా మారిపోతాయని, మెగా టోర్నీ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే నమ్మకంతో బిసిసిఐ పెద్దలు ఉన్నారు.