Reading Time: < 1 minute

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలైన శశికల కొత్త పార్టీని ప్రకటించారు. ఈ పార్టీకి ‘అఖిల భారత పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం’గా నామకరణం చేశారు. పార్టీ జెండాతోపాటు చిహ్నాన్ని కూడా ఆవిష్కరించారు.

జయలలిత స్మారకార్థం రామనాథపురంలో జరిగిన బహిరంగ సభలో శశికల మాట్లాడుతూ.. మాజీ సిఎం, ఐఏడీఎంకే(అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) వ్యవస్థాపకుడు ఎంజిఆర్ స్మరించుకున్నారు. ప్రజలకు సేవ చేయడానికి, ద్రవిడ మున్నేట్ర కజగం(DMK) సిద్ధాంతాలకు వ్యతిరేకంగా MGR పార్టీని స్థాపించారని చెప్పారు. ముఖ్యంగా పేదల పక్షాన నిలబడాలనే సంకల్పంతోనే ఈ పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఎంజిఆర్ తర్వాత జయలలిత ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ప్రజలకు సేవ చేశారన్నారు. ఆమె చనిపోయిన అనంతరం AIADMK ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. ఆయన నాయకత్వంలో పార్టీ పతనావస్థకు చేరుకుందని శశికల విమర్శించారు.

కాగా, జయలలిత మరణం తర్వాత శశికల, AIADMK తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే, అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెను పార్టీ నుండి బహిష్కరించారు.