
కళ కళ కోసమే కాదు, కళ సామాజిక ప్రయోజనం కోసం, పాట వినోదం కోసం కాదు, పాట సమాజ హితం కోసం, ప్రజల ఆశలు, ఆవేదనలే పల్లె పాటలు వారి మనసు ఆకళింపు చేసుకోవడానికి కళ ఒక శక్తివంతమైన ఆయుధం. ప్రజాసంస్కృతికి గొంతుక అయిన గద్దర్, ఆధునిక తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరు గద్దర్. తన పాటల ద్వారా, ప్రదర్శనల ద్వారా గద్దర్ సంప్రదాయ జానపద కళలను సామాజిక, రాజకీయ వ్యక్తీకరణకు శక్తివంతమైన మాధ్యమంగా మార్చాడు. జననాట్య మండలితో అనుబంధంగా ఉంటూ బుర్రకథ, ఒగ్గుకథ, జముకుల కథ వంటి జానపద కళారూపాలను వినియోగించి అణగారిన వర్గాల జీవితం, వ్యవసాయ కూలీల కష్టాలు, సామాజిక పోరాటాల కథలను ప్రజలకు వినిపించాడు. గద్దర్ ప్రదర్శనలు ఆట, పాట, మాటల సమ్మేళనంగా ఉండేవి. పురాణ కథలకే పరిమితం కాకుండా భూమిలేని రైతులు, పేదరికం, కులవివక్ష, దోపిడీ వంటి సమస్యలను తన కళారూపాల ద్వారా ప్రతిబింబించాడు. అతని పాటలు నిరసన స్వరాలుగా మారి విప్లవోద్యమాలకూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికీ సాంస్కృతిక చైతన్యాన్ని కల్పించాయి.
తెలంగాణ భాషా వ్యాప్తికి, సాంస్కృతిక వికాసానికి సిఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందనడానికి నిదర్శనం గత రెండు సంవత్సరాలుగా ప్రజాకళలకు, కళాకారులకు, రచయితలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తున్నారు. తెలంగాణలో దశాబ్దాల కాలంనుంచి భాషా, సాహిత్య సాంస్కృతిక, కళల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థల సేవలను మరింత ప్రోత్సహించేందుకు ఆయా సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తూ రేవంత్ రెడ్డి ‘సృజనాత్మక శతాబ్దం వినోదరంగ భవిష్యత్తు’ అని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో చిత్రరంగం అత్యున్నత స్థాయికి వెళ్లాలని కాంక్షించారు. తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ ఎదుగుదలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం స్పష్టం చేస్తూ భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రపంచ స్థాయిలో ఐరిష్ రచయిత నాటకరంగ పితామహుడు ఆస్కార్ విల్డ్, భారతీయ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, స్వర్ణ కమలం అవార్డు, అసోంలో ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికాకు ఇచ్చిన గౌరవం ఎంత గొప్పదో, తెలంగాణ ప్రభుత్వం కూడా గద్దర్‌కు అదే స్థాయి గౌరవాన్ని ఇచ్చింది. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం కళాకారులకు మాత్రమే కాకుండా ప్రజా ఉద్యమాలకు కూడా గౌరవం ఇచ్చినట్టే. కొత్త కథలు, కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఆలోచనతో గద్దర్ అవార్డులు ముందుకు రావడం అభినందనీయం, ఇదే సమయంలో సినీ రంగానికి మరింత ప్రోత్సాహం అందించాలంటే ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. గద్దర్ పేరుతో పురస్కారాలు ఇవ్వడం తెలంగాణ సంస్కృతి, పోరాట చరిత్రకు గుర్తింపుగా నిలుస్తుంది. విప్లవ గాయకుడు గద్దర్ ప్రజల మనసుల్లో ఎప్పటికీ జీవించే వ్యక్తి, ఆయన పాటలు సమాజంలో చైతన్యం తీసుకు వచ్చాయి, ప్రజలను ఆలోచింపజేశాయి. తెలంగాణ గడ్డపై ప్రతి ఇంట్లో గద్దర్ వంటి స్ఫూర్తిదాయక వ్యక్తులు ఉంటారు.
అలాంటి మహానుభావుడి పేరుతో ప్రభుత్వం అవార్డులు ఏర్పాటు చేయడం నిజంగా గర్వకారణమం. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చే నంది పురస్కారాలకు ఎంతో గౌరవం ఉండేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అవి నిలిచిపోవడంతో సినీ పరిశ్రమలో ఒక లోటు ఏర్పడిందని అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులు ప్రారంభించడం ద్వారా కళాకారులకు మళ్లీ ప్రోత్సాహం కలిగింది. ముఖ్యంగా ఈ అవార్డుల్లో యువతరానికి ఎక్కువ అవకాశాలు రావడం సంతోషకరం అని తెలంగాణ ప్రజానీకం భావిస్తుంది. ఉత్తమనటులు, దర్శకులు, గాయకులు వంటి అనేక విభాగాల్లో కొత్త ప్రతిభ కనిపించడం సినీ రంగానికి మంచి సంకేతమని అని భావించి ఉత్తమ పౌర సమాజ నిర్మాణంలో చిత్ర పరిశ్రమకు అంటూ ఒక అర్థం ఉండాలని భావించి కళాకారులను అభివృద్ధి వైపు సంక్షేమం వైపు ఆలోచించడానికి వారిని అభినందించడానికి గద్దర్‌ని స్ఫూర్తిగా తీసుకోవడం ప్రజాకళలకు పట్టం కట్టడమే.
– డా. జివి వెన్నెల
( చైర్మన్, తెలంగాణ సాంస్కృతిక సారథి)