Reading Time: < 1 minute

రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు (హాఫ్‌డే స్కూల్స్) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఒంటిపూట విధానంలోనే నడుస్తాయి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. తరగతులు ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు.

అయితే, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే, పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ కేంద్రాలు కూడా 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి. అయితే, మార్చి 15 ఆదివారం కావడంతో సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పనిదినం కాగా, ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.