Reading Time: < 1 minute

 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అంతా అబద్ధమని, క్షేత్రస్థాయిలో రైతులకు కేవలం 12 గంటల విద్యుత్ మాత్రమే అందుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కోహిర్ సబ్‌స్టేషన్‌ను ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింత ప్రభాకర్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌లోని లాంగ్ బుక్కులను స్వయంగా పరిశీలించిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ సబ్‌స్టేషన్ రికార్డులు మరోలా ఉన్నాయని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సాయంత్రం 4 గంటలకు త్రీ ఫేజ్ కరెంటు తీసేసి, తిరిగి తెల్లవారుజామున 3 గంటలకు ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇచ్చిన కొద్దిపాటి సమయంలోనూ లైన్ బ్రేకింగ్, ఎల్ ల పేరుతో గంటల తరబడి కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. నాణ్యమైన విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులపై అదనపు భారం

బీఆర్‌ఎస్ హయాంలో కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం డిడి ధర రూ. 4,900 ఉంటే, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ. 9,700కు పెంచిందని హరీష్ రావు విమర్శించారు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన ధ్వజమెత్తారు. కాలిన ట్రాన్స్‌ఫార్మర్ల భారాన్ని రైతులపైనే వేస్తున్నారు. వేలాది కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.‘ ఉన్న రెండు డిస్కమ్‌లను రూ. 55 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టి, ఇప్పుడు బ్యాంకులను, ఆర్థిక సంస్థలను మోసం చేయడానికే కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీష్ రావు ఆరోపించారు.

ఆర్టిజాన్ల సమ్మెకు మద్దతు

సమ్మె చేస్తున్న 19,647 మంది ఆర్టిజాన్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టిజాన్ల పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, విధి నిర్వహణలో మృతి చెందిన ఆర్టిజాన్ల పిల్లలకు వారి విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విద్యుత్ సమస్యలను హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు.