Reading Time: < 1 minute

కేరళ పేరు మార్పుపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Caption of Image.

తిరువనంతపురం: కేరళ రాష్ట్ర పేరు మార్పుపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ పేరును కేరళంగా మార్చడం ఆనందకరమైన క్షణమని.. ఇది రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బుధవారం (మార్చి 11) మోడీ కేరళలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు. అనంతరం కొచ్చిలో జరిగిన అఖిల కేరళ ధీవర సభ స్వర్ణోత్సవ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. 

నాకు ప్రజలే దేవుళ్లతో సమానమని.. మీ నుంచి ఆశీర్వాదాలు పొందడానికి  ఇక్కడికి వచ్చానని తెలిపారు. కేరళ పేరును కేరళంగా మార్చాలని మీరు చాలా సంవత్సరాలుగా కోరుకున్నారని.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించిందని చెప్పారు. భారతదేశంలోని ఈ అత్యంత అందమైన రాష్ట్రం ఇప్పుడు మలయాళీ సంస్కృతి ప్రకారం సరైన పేరు, గుర్తింపును పొందిందని.. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేరళ ప్రజలందరినీ అభినందిస్తున్నానని అన్నారు. 

2018లో కేరళలో వరదల సమయంలో మత్స్యకార సమాజం పోషించిన పాత్రను ప్రశంసించారు. ధీవర సభ 50 సంవత్సరాలుగా మత్స్యకారుల హక్కుల కోసం పనిచేస్తోందని అన్నారు. సముద్రంలో మత్స్యకారుల భద్రతను నిర్ధారించడానికి పడవల్లో 4,500 కి పైగా ఉపగ్రహ ఆధారిత ట్రాన్స్‌పాండర్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.

 

©️ VIL Media Pvt Ltd.