Reading Time: < 1 minute

కల్తీ అల్లంవెల్లుల్లి తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, హబీబ్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.20లక్షల విలువైన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… మల్లేపల్లి, అఫ్జల్‌సాగర్, గటాల మసీదు సమీపానికి చెందిన మహ్మద్ షారూఖ్ ‘షెహజాదా ఫుడ్ మాస్టర్ పేరు సంస్థను నిర్వహిస్తున్నాడు. నిందితుడు కల్తీ అల్లంవెల్లుల్లి తయారు చేసి హోల్‌సేల్ కిరాణా షాపులు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీస్‌లకు సరఫరా చేసేవాడు. నాసిరకం అల్లంవెల్లుల్లి కొనుగోలు చేసి వాటిలో అసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్స్, గమ్ పౌడర్, ఉప్పు వంటి రసాయనాలను కలిపి ప్లాస్టిక్ కంటైనర్లలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి ప్టాస్టిక్ డ్రమ్ముల్లో మూత పెట్టకుండా ఉంచాడు, దీంతో దుమ్ము, ఈగలు, ఇతర కలుషితాలకు గురై, వినియోగానికి పనికిరాని కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తీసుకుని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ 2018లోనే ముగిసింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. రాఘవేందర్, ఎస్సై జి. శ్రీకాంత్, హబీబ్ నగర్ ఎస్సై కె. శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.