Reading Time: < 1 minute

ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఏ ఒక్క ఓటరును తొలగించేది లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్‌లో ప్రశాంతంగా ఎన్నికలు జరపడానికే ఎన్నికల సంఘం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈసీ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుందని, ఎలాంటి లోటుపాట్లను సహించేది లేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు, అధికారులతో వరుస సమావేశాల అనంతరం మీడియాతో సీఈసీ మంగళవారం నాడు మాట్లాడారు.

పశ్చిమబెంగాల్‌లో 80,000 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో 61,000 బూత్‌లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని సీఈసీ చెప్పారు. ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత, అవకతవకల నిరోధానికి అన్ని పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ ప్రక్రియ అమలు చేస్తామని తెలిపారు. రాజ్యంగం ప్రకారమే ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహించామని, పూర్తిగా పారదర్శకతంగా జరిగిందని తెలిపారు. మరోవైపు సీఈసీకి మంగళవారంనాడు కూడా నిరసనల సెగ తప్పలేదు. ఉదయం దక్షిణేశ్వర్ కాళి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చినప్పుడు కొందరు నల్లజెండాలతో నిరసన తెలుపుతూ ‘గో బ్యాక్’ నినాదాలు చేశారు.