Reading Time: 2 minutes

‘చదువని వాడజ్ఞుడగు

చదివిన సదసద్వివేక చతురత దెలియున్

చదువగ వలయును జనులకు’ అని మహాకవి పోతన చదువు గొప్పతనం గురించి 15వ శతాబ్దంలోనే చెప్పాడు. చదువుకోకపోతే అజ్ఞానం ఆవరిస్తుందనీ, చదివితే సత్యాసత్యాల విచక్షణ కలుగుతుందనీ కాబట్టి ప్రజలందరూ చదువుకోవాలని పోతన సందేశం. కానీ మన దేశంలోని సామాజిక నిర్మాణం అందరూ చదువుకునే అర్హతను నిషేధించింది. తద్వారా చదువుకు దూరమైన అధిక సంఖ్యాకులైన కింది కులాల ప్రజల బతుకులు చీకటిమయమయ్యాయి. పైవర్గాలకు నిర్బంధ సేవ చేయటంలోనే వాళ్ళ జీవితాలు తెల్లారిపోయేవి. ఈ పరిస్థితి పట్ల మొదటిసారి చలించిపోయినవారు మహాత్మా జ్యోతిరావుఫూలే, అతని భార్య సావిత్రీబాయి ఫూలే. ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించి కింది కులాల బతుకుల్లోకి వెలుగులు రావాలంటే వాళ్ళు చదువుకోవడం తప్ప వేరే మార్గం లేదనే నిర్ణయానికి వచ్చారు ఫూలే దంపతులు. ‘ఆడపిల్ల చదువుకుంటే మొత్తం ఇంటినే మార్చగలదు’ అని విశ్వసించి మొదటగా ఆడపిల్లలకు చదువు చెప్పాలని నిశ్చయించుకొన్నారు. కానీ అప్పటికి మహిళా ఉపాధ్యాయులెవరూ అందుబాటులోలేరు. ఎందుకంటే అప్పటిదాకా ఆడపిల్లలకు చదువుకునే హక్కులేదు. దీనితో జ్యోతిరావుఫూలే మొదట తన భార్యకు చదువు చెప్పాడు.

అహ్మద్‌నగర్‌లో ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించాడు. ఆ రకంగా సావిత్రీబాయి ఫూలే ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా అవతరించింది. ఆమె ఉపాధ్యాయినిగా మొట్టమొదటి అతిశూద్ర బాలికల పాఠశాల 1848 లో ప్రారభమైంది. ఆమె ఉపాధ్యాయ జీవితం ‘నల్లేరుమీద నడక’లా సాగలేదు. ఎన్నోకష్టాలతో, కన్నీళ్లతో సాగింది. కింది కులాల వాళ్లకు, అందునా బాలికలకు చదువు చెప్పటం సహించని ఆనాటి అగ్రవర్ణ పండితులు సావిత్రిని అనేక రకాలుగా బెదిరించే ప్రయత్నం చేశారు. ఆనాటి సమాజం కూడా సావిత్రి సేవను గుర్తించకపోగా ఆమె మంచి ప్రయత్నానికి అడ్డంకులు కలిగించేది. ఎందుకంటే ఆడపిల్లలు చదువుకుంటే ఊరికి కీడు కలుగుతుందని అప్పటి సమాజం నమ్మేది. పండితులు ప్రజలను మూఢత్వంలో ఉంచడానికి ఇలాంటి దుష్ప్రచారాలను ముందుకు తెచ్చేవారు. కానీ సావిత్రీబాయి దృఢనిశ్చయం ముందు అవేవీ నిలవలేకపోయాయి.

ఒకటివెంట ఒకటి దాదాపు ఏభైకి పైగా పాఠశాలలు ఏర్పాటు చేసి కింది వర్గాలవారి జీవితాల్లో వెలుగులు నింపారు సావిత్రి. ఈక్రమంలో తన భార్తతోపాటు తోటి ముస్లిం ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా ఎంతో సహకారం అందించారు. ఆనాడు వితంతువుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేది సమాజం. దానిని అడ్డుకోవడానికి ఫూలే దంపతులు పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది. వారి హక్కులను కాపాడుతూ, వారికి పునర్వివాహం జరిపే విధంగా సమాజాన్ని మార్చగలిగారు. కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు ఒక మార్గమని అంబేద్కర్ కన్నా ముందే గుర్తించారు ఫూలే దంపతులు. ఫూలే దంపతులు నివసించిన కాలానికి ఇంతలా సామాజిక సంస్కరణను ధ్యేయం చేసుకొని పనిచేసిన వాళ్ళెవరూ భారతదేశంలో లేరు. మహిళల్లో అసలే లేరు. కనుక ఈ దేశంలో తొలి మహిళా సామాజిక సంస్కర్తగా సావిత్రీబాయి ఫూలేను పేర్కొనవచ్చు. 1896లో పూణెలో ప్లేగు వ్యాధి విజృంభించి వేలమందిని బలితీసుకున్నది. వ్యాధిగ్రస్థులకు సేవ చేయటానికి అందరూ భయపడుతున్న ఆ సందర్భంలో తన దత్తపుత్రుడు యశ్వంత్‌తో సహా ప్రజల మీద ఎంతో ప్రేమతో సేవచేసింది. భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సావిత్రిబాయి కూడా ప్లేగు వ్యాధి బారినపడి మార్చి 10, 1897 నాడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమె స్ఫూర్తి మాత్రం ఎల్లకాలం నిలిచే ఉంటుంది.

– తోకల రాజేశం, 9676761415

– నేడు సావిత్రీబాయి ఫూలే వర్థంతి