Reading Time: 3 minutes

తెలంగాణలో సిపిఎం అగ్రనాయకుడు తమ్మినేని వీరభద్రంపై ఆ పార్టీ కేంద్ర కమిటి అభిశంసనకు గురిచేయడం ఆ పార్టీని కుదిపేసింది. తెలంగాణలో సిపిఎం అంటేనే తమ్మినేని, తమ్మినేని అంటేనే సిపిఎం అనే స్థాయికి తీసుకొచ్చిన ఒక మాజీ ఎంపి, మాజీ ఎంఎల్‌ఎ, పదేళ్ళపాటు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం కేంద్ర కమిటి సభ్యుడిగా వ్యవహరిస్తునే తమ్మినేనిపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రాష్ట్రం విడిపోయిన తరువాత టి-సిపిఎం పార్టీ -అంటే ‘తెలంగాణ’ సిపిఎం పార్టీగా కాకుండా టి-అంటే ‘తమ్మినేని’ సిపిఎం పార్టీగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. తెలంగాణలో ఒకనాడు పార్టీ బలంగా ఉందంటే ఆయనే కారణం. ఇప్పుడు బలహీనంగా మారిదంటే అందరి వేళ్లూ ఆయన వైపువెళ్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలో పార్టీ లైన్ తప్పితే ఎంతటి అగ్రనాయకులపైన చర్యలు తీసుకుంటారనేది గతంలో జరిగిన అనేక సంఘటనలు మన కళ్ళ ముందు ఉన్నాయి.

లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన చేసిన సోమనాథ్ ఛటర్జీ నుంచి త్రిపుర ముఖ్యమంత్రి, అప్పటి పొలిట్ బ్యూరో సభ్యుడు నృపేన్ చక్రవర్తి తెలుగు రాష్ట్రాల్లో భీమిరెడ్డి నరసింహారెడ్డి, మద్దికాయల ఓంకార్ లాంటి సీనియర్ నాయకులపైనే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు అనేకం ఉన్నాయి. గడిచిన పదేళ్ల కాలంలో అంటే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని ఉన్న సమయంలో ఆయన అనుసరించిన ఒంటేద్దు పొకడలు, గ్రూపుయిజం, క్యాస్టిజయం వంటి అభియోగాలపై కేంద్ర కమిటి అభిశంసన విధించినప్పటికీ 2004లో ఆయన ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడు, అంతకుముందు ఏడాదిపాటు ఎంపిగా పనిచేసినప్పుడు వ్యవహరించిన తీరు. వచ్చిన అనేక అవినీతి, అక్రమాల ఆరోపణలు, పంచాయతీల సెటిల్ మెంట్లు, భూకబ్జాలు, నియంతగా మారి ప్రశ్నించినవారిని అణగదొక్కడం, నిజాయితీపరులను పార్టీనుంచి బైటికి పంపించడం, నిర్మాణ రాహిత్యం, అనైతిక చర్యలు, తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని దుర్వినియోగం వంటి అనేక అభియోగాలు వచ్చిన 2008లోనే ఆ పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర, రాష్ట్ర కమిటీలకు అనేక లేఖలు రాసినా అవి బుట్టదాఖలయ్యాయి. ఆనాడే కేంద్ర కమిటీ మేల్కొని ఉంటే పరిస్థితి చేయి దాటి ఈ స్థితికి వచ్చేది కాదనే వాదన విన్పిస్తుంది.

పెద్దగా చదువుకోకపోయినప్పటికీ బాల్యదశనుంచే పార్టీలో పనిచేసిన అనతికాలంలోనే అగ్రనాయకుడిగా ఎదిగిన మంచి వక్తగా, వ్యూహకర్తగా పేరు సంపాదించుకున్నారు. రాష్ట్రంలో పార్టీ బలపడేందుకు అనేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి ఆనాడు కేంద్ర కమిటి నాయకులు, పొలీట్ బ్యూరో సభ్యులు అమోద ముద్రవేసినవే. ఆనాడు అంగీకారం తెలిపిన నేతలే ఇప్పుడు తప్పుపట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఎంత వరకు సమంజసం అనే వాదన ఆ పార్టీలో విన్పిస్తున్నది. తెలంగాణ పార్టీలో ఏర్పడ్డ అనారోగ్యకర పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ముగ్గురు పొలిట్ బ్యూరో సభ్యులను కేంద్ర పార్టీ నిర్ణయించింది. ఈ ముగ్గురిలో ఒక్కరు ఆనాడు తమ్మినేని తప్పిదాలపై పార్టీ సీనియర్, ముఖ్య నాయకులు లేఖలు రాస్తే పట్టించుకోలేదు. కాని మారిన సమీకరణల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ పార్టీ తీరు, తమ్మినేని పాత్ర బాగా లేదని సదరు నాయకుడు పెద్ద మనిషిగా కేంద్ర కమిటీకి నివేదిక ఇచ్చి తీర్పు చెప్పడం ఆ పార్టీ నేతలను ఆశ్చర్యాన్ని గురిచేసింది. రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని ఒంటెద్దు పోకడలు పోలేదు. ఈ నిర్ణయం తీసుకున్నా, ఏ వ్యూహ రచన చేసినా దానికి ఆనాడు తెలంగాణ బాధ్యతలను చూసే కేంద్ర కమిటీ సభ్యుల, కేంద్ర కమిటీ ఆమోదం ఉందనే విషయం జగద్వితమే. ఆనాడు ఆమోదించినవారే ఇప్పుడు ‘పెద్దరాయుడి’గా మారి తీర్పుచెప్పడం -శిక్షలు వేయడంపై ఆ పార్టీ నేతలే తప్పుపడుతున్నారు.

తెలంగాణలో పార్టీని విస్తరించడానికి, ప్రజాపోరాటాలను నిర్వహిస్తూ, తద్వారా పార్టీని బలోపేతం చేయడలో తమ్మినేని క్రియాశీలకంగా పనిచేశారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రధానంగా కమ్యూనిస్టు జిల్లా గా పేరుగాంచిన ఖమ్మం జిల్లాలో పార్టీని అగ్రపథంలో నిలబెట్టడానికి తమ్మినేని చేసిన కృషి అనితర సాధ్యమైనది. వ్యవసాయ కూలీలకు కనీస వేతనాల కోసం భూస్వాములను ఎదిరించి నిర్వహించిన కూలి పోరాటాలవల్ల ఆ పార్టీకి నష్టం జరుగుతుందని, భూస్వాములకు వ్యతిరేకంగా ఆయన సాగించిన ఉత్తరాల ఉద్యమంవల్ల పార్టీ ఓడిపోతుందని తెలిసి కూడా, పార్లమెంటు సీటును సైతం తృణప్రాయంగా పెట్టిన విషయం తెలియనది కాదు. సమాజ గమనాన్ని, పాలక వర్గాల వైఖరులను సరిగ్గా అంచనావేసి తదనుగుణంగా మారిన పరిస్థితులకు అనుగుణంగా సృజనాత్మకమైన పార్టీ కార్యక్రమాలకు రూపకల్పన చేయడంలో తమ్మినేని దిట్టగా పేరుంది.

వ్యక్తిగత విమర్శలు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ పార్టీని ప్రజల్లో బలంగా నిలబెట్టేందుకు ఆయన పడిన శ్రమ అంతఇంతకాదు. తమ్మినేని ఏ కార్యక్రమం చేసినా, అందులో పార్టీ ప్రయోజనం ఇమిడి ఉంటుంది. అంతేగాక ప్రతిదీ కేంద్ర కమిటికి చెప్పే ముందుడుగు వేసేవారు. ఆనాడు తమ్మినేని మాటకు కూడా కేంద్ర కమిటీ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చేది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే దుమ్ముగూడెం ప్రాజెక్టుకోసం ‘మహాప్రస్థ్దానం’ పేరుతో దుమ్ముగూడెం నుంచి ఖమ్మం వరకు వంద రోజులపాటు 2,792 కి.మీ. వరకు సుదీర్ఘంగా నిర్వహించిన పాదయాత్ర అప్పట్లో సంచలనంగా మారింది. ఎన్నికల సమయంలో తీసుకున్న పొత్తుల నిర్ణయాలు, బహుజన లెప్ట్ ఫ్రంట్(బిఎల్‌ఎఫ్) ఏర్పాటు వంటివి రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని ఒక్కరే నిర్ణయం తీసుకున్నవి కావు. ఆనాటి కేంద్ర కమిటి అమోదంతోనే అమలు చేసినవే. అయితే అవి విఫలప్రయోగం అయితే తప్పు ఒక్కరిపైనే నెపం నెట్టడం సరైంది కాదనే వాదన విన్పిస్తుంది. శిబిరంలో చోటుచేసుకున్న అన్నిరకాల అవాంఛనీయ సంఘటనలపై ఛార్జిషీట్ పెట్టగా ఆనాడు ‘తన తప్పు జరిగిందని భవిష్యత్తులో మరోసారి తప్పు చేయనని సరిదిద్దుకుంటానని’ తమ్మినేని స్టేట్‌మెంట్ ఇచ్చారు.

గడిచిన కొద్దికాలంగా తమ్మినేనిలో మార్పుకోసం పదేపదే పొలిట్ బ్యూరో కమిటీ సభ్యులు తమ ప్రయత్నాలు చేసినప్పటికీ పెడధోరణులు పెరిగి, బహిరంగంగా అస్తిత్వవాద ప్రచారపు రూపుదాల్చిందని ఉద్దేశంతో చివరికి అభిశంసన అస్త్రాన్ని ఆ పార్టీ ప్రయోగించక తప్పలేదని తెలుస్తోంది. వయోభారం మీదపడి, 72 ఏళ్ల వయస్సులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కేంద్ర పార్టీ తీసుకున్న చర్య సరైంది కాదని ఆయన వ్యతిరేకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తప్పులుచేస్తే సరిచేసుకోవాలని సుతిమెత్తగా అంతర్గతం హెచ్చరించించవచ్చు. కాని దానిని బహిర్గతం చేయడాన్ని కూడా కొంతమంది తప్పుపడుతున్నారు. పార్టీకి ఎదో చేయాలనే తపనలో కొన్ని పొరపాట్లు జరగడం సహజమే. కాని కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని బలంగా అనుసరించే ఈ పార్టీలో ఎంతటి పెద్ద నాయకుడైన క్రమశిక్షణ కట్టుతప్పితే శిక్షతప్పదనే హెచ్చరికను మరోసారి పైనుంచి క్రింది స్థాయి పార్టీ శ్రేణులకు చేరవేసేందుకే ‘అభిశంసన’ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

– వనం వెంకటేశ్వర్లు

(ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)