Reading Time: 2 minutes

 రామగుండం థర్మల్ విద్యుత్‌ను కొనుగోలు చేయండి

బొగ్గు సమీకరణకు ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి

సిఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్‌టిపిసి రెండో దశలో భాగంగా రామగుండంలో ఏర్పాటు చేయనున్న (3X800) మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పిపిఏ) చేసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి సూచించారు. ఇంకా 5X800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడానికి ఎన్‌టిపిసికి తగిన స్వేచ్ఛను ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరుతూ సోమవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రామగుండంలో ఎన్‌టిపిసి ఏర్పాటు చేసిన మొదటి దశకు దాదాపు రూ. 12,000 కోట్ల వ్యయంతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 2X800=1600 మెగావాట్ల రెండు థర్మల్ పవర్ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడి 2023 లో ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

అనంతరం సెకండ్ ఫేజ్ లో భాగంగా 3X800=2,400 మెగావాట్ల సామర్థ్యంతో మిగిలిన మూడు పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎన్‌టిపిసి చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. మొదటి దశ తరహాలో రెండవ దశలో ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 85% విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సరఫరా చేయనుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఈ నెల 3 న మునుపెన్నడూ లేనివిధంగా అత్యధికంగా 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యిందని ఆయన తెలిపారు. రానున్న రోజులలో ఈ డిమాండ్ మరింతగా పెరగనుంది కాబట్టి రాష్ట్రంలో అవసరమైన విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ రంగం మీద ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్‌లో జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా గ్రిడ్ స్థిరత్వాన్ని పరిరక్షించడానికి రాష్ట్రంలో 5000 నుంచి 6000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సి ఉందని ఆయన తెలిపారు.

అంతేకాకుండా 2047 నాటికి రాష్ట్రంలో లక్ష మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడంలో ఎన్‌టిపిసికి దేశంలోనే విశేషమైన అనుభవం ఉందని ఆయన తెలిపారు. గతంలో విద్యుత్ రంగంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇతర థర్మల్ పవర్ ప్రాజెక్టులతో పోలుస్తూ, మొదటి దశలో భాగంగా రామగుండంలో ఏర్పాటు చేసిన థర్మల్ పవర్ ప్రాజెక్టు గురించి స్వయంగా మీరు ప్రశంసించారని ఆయన ముఖ్యమంత్రికి గుర్తు చేశారు.

రెండో దశ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడానికి ఎన్‌టిపిసికి స్వేచ్ఛను ఇస్తే, థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకే ఉత్పత్తి చేసి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఎన్‌టిపిసి సిద్ధంగా ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి, ఈ విషయంలో మీరు చొరవ తీసుకుని,విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఎన్‌టిపిసి రెండో దశలో భాగంగా రామగుండంలో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పిపిఏ) చేసుకునేలా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వానికి, ప్రజలకు మేలు చేకూర్చే రామగుండం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.