
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకాలం నాటి పాత కేసు నుంచి బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సహా కీలక నేతలకు ఊరట లభించింది. 2011లో నిర్వహించిన సకల జనుల సమ్మె సందర్భంగా నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ తీర్పుతో సుమారు 15 ఏళ్ల నాటి వివాదానికి తెరపడింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పట్లో జెఎసి పిలుపునిచ్చిన సకల జనుల సమ్మెలో కెసిఆర్, కెటిఆర్, పద్మారావు గౌడ్, శంబీపూర్ రాజు, దాసోజు శ్రవణ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ క్రమంలో రైలు రోకోలు, రహదా రుల దిగ్బంధం వంటి నిరసనలు చేపట్టారు. దీనిపై అప్పట్లో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు నింది తులపై సరైన ఆధారాలు లేవని అభిప్రాయపడుతూ కేసును కొట్టేసింది. ఈ కేసు విచారణలో భాగంగా గతంలోనే పలుమార్లు నేతలు కోర్టుకు హాజ రయ్యారు. రాజకీయ ప్రేరేపితమైన కేసులుగా వారు వాదనలు వినిపించారు. తాజాగా వెలువడిన తీర్పుపై బిఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తు న్నాయి.