Reading Time: < 1 minute

అహ్మదాబాద్: ఆదివారం జరిగిన టి-20 ప్రపంచకప్-2026 ఫైనల్‌ మ్యాచ్‌లో టీం ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టి-20 ప్రపంచకప్‌ను అందుకుంది. ఈ విజయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాత్ర ఎంతో ఉంది. ధోనీ, రోహిత్ శర్మల తర్వాత భారత్‌కు టి-20 ప్రపంచకప్‌ను అందించాడు సూర్య. అంతేకాక.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి దఫాలోనే జట్టును మెగా టోర్నీలో విజేతగా నిలిపి ధోనీ సరసన చేరాడు.

అయితే ఈ మ్యాచ్‌కి ముందు సూర్యకుమార్ యాదవ్ రిటైర్‌మెంట్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. 35 ఏళ్ల సూర్యకుమార్.. ఫైనల్ మ్యాచ్ గెలిచినా.. ఓడినా.. రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. అయితే సూర్య ఈ వార్తలకు ఒకే ఒక జవాబుతో ఫుల్‌స్టాప్ పెట్టాడు. మ్యాచ్ అనంతరం కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి సూర్యకుమార్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సూర్యని ఓ విలేకరి రిటైర్‌మెంట్ గురించి ప్రశ్నించాడు. దీనికి సూర్య ‘‘అంతా బాగానే ఉంది కదా.. ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు’’ అని జావాబిచ్చాడు.