
Raj Thackeray: బాలీవుడ్ నటులు ఆర్. మాధవన్, వివేక్ ఒబెరాయ్ చుట్టూ రాజకీయ వేడి కూడా పేరుగుతున్నట్లే కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బహిరంగంగా ప్రశంసించే ఈ నటులు విదేశాల్లో ఎందుకు నివసిస్తున్నారని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే తీవ్రంగా ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలతో పాటు సినీ రంగంలోనూ చర్చనీయాంశంగా మారాయి. ముంబైలో మహారాష్ట్ర నవనిర్మాణ విద్యార్థి సేన 20వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన యువజన సభలో రాజ్ థాకరే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పే ప్రముఖులు తమ కుటుంబాలతో కలిసి దుబాయ్ వంటి విదేశీ నగరాల్లో ఎందుకు నివసిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
దేశం ఇంత గొప్పగా మారిందని నిజంగా నమ్మితే, ఇక్కడే ఉండి జీవించకపోవడానికి కారణమేంటని నిలదీశారు. ప్రత్యేకంగా ఆర్. మాధవన్ పేరును ప్రస్తావించిన రాజ్ థాకరే, మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించే వ్యక్తి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారని వ్యాఖ్యానించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమాలో ఆయన పాత్ర పోషించిన వివేక్ ఒబెరాయ్ కూడా దుబాయ్‌లో నివసిస్తున్నారని గుర్తు చేశారు. దేశాభివృద్ధిని ప్రశంసిస్తూ, నివాసం మాత్రం విదేశాల్లో కొనసాగించడం విరుద్ధమైన వ్యవహారంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సినిమాలలో నటించేందుకు మాత్రమే భారత్‌కు వచ్చి, పనులు పూర్తయ్యాక మళ్లీ విదేశాలకు వెళ్లిపోతున్నారని కూడా రాజ్ థాకరే ఆరోపించారు. దేశంలో అవకాశాలు వినియోగించుకుని, నివాసం మాత్రం విదేశాల్లో కొనసాగించడం సరైన సందేశం కాదని అన్నారు.
పారిశ్రామికవేత్తలు కూడా విదేశాలకు తరలిపోతున్నారని ప్రభుత్వం పార్లమెంటులోనే అంగీకరించిందని ఆయన వ్యాఖ్యానించారు. అదే సభలో యువత సమస్యలపై కూడా రాజ్ థాకరే మాట్లాడారు. తాను రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాలంతో పోలిస్తే నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ఒకప్పుడు విద్యార్థుల సమస్యలు వేరు అయితే, ఇప్పుడు డిజిటల్ యుగంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని వివరించారు. టెలిగ్రామ్ కాలం నుంచి ఇన్‌స్టాగ్రామ్ తరం వరకు వచ్చిన మార్పులను తాను ప్రత్యక్షంగా చూశానని అన్నారు. ఇటీవల జెన్ జెడ్ తరం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోందని పేర్కొన్న రాజ్ థాకరే, పట్టణ యువత మాత్రమే కాకుండా మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లోని అదే వయసు వారికి ఎదురవుతున్న సమస్యలను కూడా సమానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రామీణ యువత ఆశలు, అవకాశాలు, సవాళ్లను కూడా రాజకీయాలు పట్టించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్ థాకరే చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఆర్. మాధవన్, వివేక్ ఒబెరాయ్ నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. అయితే దేశభక్తి, రాజకీయ మద్దతు, విదేశీ నివాసం వంటి అంశాలపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వివాదంపై బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.