
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు విరామం తరువాత సోమవారం నుంచి తిరిగి ఆరంభం కానున్నాయి. లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ఉమ్మడిగా ఆయన తొలిగింపునకు అవిశ్వాస తీర్మానం తొలిరోజే తీసుకురానున్నాయి. దీనితో బడ్జెట్ రెండో దశ పార్లమెంట్ వాడివేడిగా మారనుంది. ఇక ప్రస్తుత మధ్యప్రాచ్య యుద్ధం, అమెరికాతో మధ్యంతర ట్రేడ్ డీల్ వంటి అంశాలపై కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడనున్నాయి. ప్రధాని మోడీ ఇటీవలి ఇజ్రాయెల్ పర్యటన, ఆ తరువాతి ఇరాన్‌పై దాడులు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి గురించి కూడా విపక్షాలు అస్త్రశస్త్రాలు సంధించేలా ఉన్నాయి. ఎప్‌స్టీన్ ఫైళ్ల వ్యవహారం కూడా సభలలో ప్రస్తావనకు రానుంది.
పార్లమెంట్ విరామానికి ముందు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభ స్పీకర్‌పై చేసిన ఘాటైన వ్యాఖ్యలు , ఇందుకు ప్రతిగా ఆయనను సభ నుంచి వెలివేయాలనే అధికార పక్షం పావులు వంటివి కూడా సెషన్‌ను రగిలించే విధంగా సిద్ధంగా ఉన్నాయి. ఈ సెషన్ ఏప్రిల్ 2న ముగుస్తుంది. ఇక ఈ ఏడాది తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికలు ఉన్నందున ఈ సెషన్ ద్వారా తమ రాజకీయ లబ్థికి ప్రతిపక్షాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించేందుకు అధికార పక్షం వ్యూహాలకు పదును పెట్టుకుంది.
బెంగాల్ తాజా ఉదంతం బిజెపి అస్త్రం
రెండు రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన, ఈ సందర్భంగా అక్కడి టిఎంసి ప్రభుత్వం ప్రోటోకాల్ ఉల్లంఘన అంశం కూడా ప్రస్తావనకు రానుంది. మహిళ, ఆదివాసి నేత అయిన రాష్ట్రపతిని అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించింది. ముఖ్యమంత్రి మమత బెనర్జీ దురుసుగా వ్యవహరించారని పేర్కొంటూ ప్రతిపక్షాలను విమర్శించేందుకు బిజెపి, మిత్రపక్షాలు శనివారం, ఆదివారాలలో కసరత్తులకు దిగారు. సోమవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్‌లీడర్ల సమావేశం జరుగనుంది. ఏఏ అంశాలపై ఏ విధంగా ప్రభుత్వంపై దాడికి దిగాలి? సంఘటిత శక్తిని చాటుకోవాలనే విషయంపై చర్చిస్తారు.టిఎంసి వ్యవహారశైలి పడని ఇతర ప్రతిపక్షాలు కూడా ఈసారి బెంగాల్ కేంద్రీకృతంగా చేసుకుని మోడీ ప్రభుత్వంపై విమర్శలకు దిగే అవకాశం ఉంది.