Reading Time: 2 minutes

ఖమేనీ హత్యకు మూల్యం చెల్లించక తప్పదు

ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు తప్పు  అంచనా వేశారు

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్, ఖమేనీ సన్నిహితుడు అలీ హెచ్చరిక

టెహ్రాన్ : అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ను ఇరాన్ ఎప్పటికైనా విడిచిపెట్టదని, అతడి అంతు చూస్తామని, ఖమేని అనుచరుడు, ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని ఆదివారంనాడు హెచ్చరించారు. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ట్రంప్ తగిన మూల్యం చెల్లించకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై మెరుపుదాడులు ప్రారంభించాయి. అదే రోజు 86 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ నివాసంపై బాంబులవర్షం కురిపించి ఆయనను హతమార్చాయి. దీంతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. కేవలం కక్షతో ఇరాన్ అధినేతను అంతం చేసిన అమెరికాపై మేం ప్రతీకారం తీర్చుకుంటాం. ట్రంప్ భారీ మూల్యం చెల్లించాలి. చెల్లించుకు తీరతారు అని లారిజాని ఆదివారం సోషల్ మీడియా ఎక్స్ లో ఒక పోస్ట్ లో హెచ్చరించారు.

ఇరాన్ ఇరుగు పొరుగు దేశాలు తమ భూభాగాన్ని అమెరికా ఉపయోగించుకోకుండా నిరోధించాలని డిమాండ్ చేశారు. ఆ దేశా లు అలాంటి పని చేయలేని పక్షంలో మనమే చేసి తీరాలని, మరో మార్గం లేదని కూడా అలీ లారిజాని తన పోస్ట్ లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలోని తమ ఇరుగు పొరుగు దేశాల లోని స్థావరాలనుంచి నుంచి శతృవు విరుచుకుపడుతుంటే, తాము ఖచ్చితంగా ప్రతిస్పందించి తీరతామని ఆయన హెచ్చరించారు. ఇరాన్ కూడా కొంతమంది అమెరికన్ సైనికులను బంధించిందని కూడా ఆయన ప్రకటించారు. లారిజాని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జిసి) మాజీ కమాండర్ కూడా.

ఇరాన్ ట్రంప్ ను ఎప్పటికీ వదిలిపెట్టదని ఆయన ఇరాన్ టీవీకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో స్పష్టం చేసారు.ట్రంప్ యుద్ధోన్మాదానికి సుప్రీంలీడర్ తో పాటు వేయిమందికి పైగా ఇరాన్ ప్రజలు మరణించారని,అది అంత తేలికైన విషయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ను సర్వనాశనం చేసే ఉద్దేశ్యంతోనే అమెరికా, ఇజ్రాయెల్ తో కలిపి ఈ దాడులకు పూనుకున్నదని ఆయన నిందించారు. వెనెజువెలా లో మదురోను బంధించిన తర్వాత బెదిరింపుతో తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తనకు సహకరించేలా చేసుకున్న ట్రంప్ ఇరాన్ లో కూడా అలాంటి కుట్రకు తెరలేపాడని లారిజానీ ఆరోపించారు.

పశ్చిమాసియాలో పరిస్థితులను, ముఖ్యంగా ఇరాన్ ను ట్రంప్ తక్కువగా అంచనా వేశారని హెచ్చరించారు. ఇరాన్ పై అమెరికా – ఇజ్రాయెల్ దాడులు, ఖమేని హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రంగా హెచ్చాయి. ఇరాన్ ఈ ప్రాంతంలోని వివిధ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో పరిస్థితులు మరింత దిగజారాయి.