
30 నెలల్లో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి
వచ్చే ఏడాది మార్చి నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్
జూన్ నాటికి భూసేకరణ పనులకు రూ.5 కోట్లు విడుదల
సత్వరమే జూరాల డీలిస్టింగ్ పనులు
సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్
మన తెలంగాణ/హైదరాబాద్: పాలమూరు -రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను వచ్చే 30 నెలల్లో పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకువస్తామని రాష్ట్ర సాగునీటి, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పాలమూరు ప్రాంతానికి చెందిన ముఖ్య సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు త్వరగా సాగునీటి ప్రయోజనాలు అందించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని చెప్పారు. అలాగే 2027 మార్చి మాసంతానికి కల్వకుర్తి, నెట్టెంపాడు ,భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి సమృద్ధిగా సాగు నీరు, త్రాగు నీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ఆదివారం నిర్వహించిన సమీక్షకు ఆయన అధ్యక్షత వహించగా, ఈ సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్థక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్, జూపల్లి, వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కొయిలసాగర్ సాగునీటి ప్రాజెక్టుల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు గత ప్రభుత్వం రూ.35,200 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చి సుమారు రూ.27,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు. 2023 సెప్టెంబర్‌లో ఒక పంపును కేవలం గంటపాటు మాత్రమే నడిపారని, ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని వారు విమర్శించారు.
ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగి రూ.55,000 కోట్లకు పైగా చేరిందని, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కలుపుకుంటే మొత్తం వ్యయం రూ.80,000 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటివరకు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ.7,161 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. దీనిలో ప్రాజెక్టు పనులకు రూ.6,718 కోట్లు, భూసేకరణకు రూ.284.71 కోట్లు, పునరావాసానికి రూ.63.65 కోట్లు, ఇతర పనులకు రూ.94 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
హక్కు మేరకు కృష్ణా జలాల్లో ఒక్క చుక్క కూడా వదలం
తెలంగాణకు కృష్ణా నదిలో ఉన్న హక్కు మేరకు నీటిని పూర్తిగా వినియోగించుకుంటామని, ఒక్క బొట్టు కూడా వృథా కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.909 కోట్లు, నెట్టంపాడు ప్రాజెక్టుకు రూ.252 కోట్లు, భీమా ప్రాజెక్టుకు రూ.200 కోట్లు, కొయిలసాగర్ ప్రాజెక్టుకు రూ.185 కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. ఈ పనులను మిషన్ మోడ్‌లో పూర్తి చేసేందుకు భూసేకరణ, పునరావాస చర్యలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఈ పనుల కోసం జూన్ 2 నాటికి రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
బిఆర్‌ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలం 2014 తర్వాత అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని వారు విమర్శించారు. పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో నీటి ఎత్తిపోతల పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్ల ఖర్చులు పెరిగి రాష్ట్రానికి నష్టం జరిగిందని అన్నారు. ఇదే విధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో తుమ్మిడిహట్టి స్థానంలో మేడిగడ్డను ఎంచుకోవడం కూడా తెలంగాణ రైతులకు అన్యాయం చేసిన నిర్ణయమేనని మంత్రులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అవసరమైన నిధులను కేటాయించి ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని మంత్రి తెలిపారు. అన్ని పనులు పారదర్శకంగా, చట్టబద్ధంగా చేపడతామని స్పష్టం చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని రైతులకు నీటి అందుబాటు, పంటల ఉత్పత్తి పెరుగుదల, ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కేంద్రిత విధానాలతో ముందుకు సాగుతోందని చెప్పారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డీసిల్టింగ్
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో డీసిల్టింగ్ పనులను వెంటనే చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులకు మంత్రులు ఆదేశించారు. 1995లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మొదట 11.94 టీఎంసీల స్థూల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నప్పటికీ, కాలక్రమేణా మట్టికూడిక కారణంగా ప్రస్తుతం సుమారు 9 టీఎంసీలకు తగ్గిందని తెలిపారు. డీసిల్టింగ్ ద్వారా తీసే ఇసుకను గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.
తెలంగాణకు కృష్ణా నదిలో ఉన్న హక్కు మేరకు నీటిని పూర్తిగా వినియోగించుకుంటామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 148.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి నమోదు కావడం దేశంలోనే అత్యధికమని పేర్కొన్నారు. అలాగే సుమారు 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20,000 కోట్లు నేరుగా జమ చేశామని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ఈ. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.