Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ఆకర్షించడంలో హైదరాబాద్ మిగతా నగరాల కంటే ముందంజలో ఉందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాల వల్ల రియల్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. సచివాలయంలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త నిర్ణయాల్ని తీసుకుంటుందని తెలిపారు.

ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతినార్జించిందని వెల్లడించారు. అనేక దేశ, విదేశీ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకొస్తున్నాయని అన్నారు. నగరానికే తలమానికమైన మెట్రో సెకండ్ ఫేజ్, రతన్ టాటా గ్రీన్ ఫీల్ రోడ్డు వంటివి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి రియల్ ఎస్టేట్ వీక్లీ పేపర్ హైదరాబాద్ నుంచి ఆరంభం కావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పట్లోళ్ల కిరణ్, గొట్టేటి రాజేష్, ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ చిలుకూరి హరిప్రసాద్, ఈసీ సభ్యులు అమిత్ బట్టు, వనం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.