
ఇరాన్‌ను నిప్పుల గుండం చేసిన ఇజ్రాయెల్
ఐదు చమురు డిపోలు, రిఫైనరీలపై క్షిపణి దాడులు
క్షిపణి వ్యవస్థ, కమాండ్ సెంటర్లు విధ్వంసం
తిప్పికొట్టిన ఇరాన్.. కువైట్ ఎయిర్‌పోర్ట్, చమురు నిల్వలపై దాడులు
దుబాయ్‌లోని మెరీనా టవర్‌పై కుప్పకూలిన క్షిపణి శకలాలు
బహ్రెయిన్ డిశాలినేషన్ ప్లాంట్‌పై దాడి
నార్వేలో అమెరికా ఎంబసీ వద్ద పేలుడు
మున్ముందు మరిన్ని ఆశ్చర్యకరదాడులు : నెతన్యాహు
యుద్ధంలో భాగంగా తొమ్మిదో రోజైన ఆదివారంనాడు ఇరాన్‌తో పాటు అమెరికాఇజ్రాయెల్ సంయుక్త బలగాల పరస్పర పోరు నిప్పుల వానను తలపించింది. తెల్లవారుజాము నుంచే ఇరు వర్గాలు క్షిపణులు, డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన చమురు డిపోలను ఇజ్రాయెల్ వైమానిక దళాలు లక్షంగా చేసుకున్నాయి. టెహ్రాన్‌లోని ఐదు చమురు డిపోలతోపాటు రిఫైనరీలపై క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో ఆకాశంలో నల్లని దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, కమాండ్ సెంటర్లు, చమురు డిపోలపై విచక్షణారహితంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. శత్రువును తీవ్రంగా దెబ్బతీశామని తెలిపింది. ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో 10వేల నిర్మాణాలు నేలమట్టమయ్యాయని ఇరాన్ ప్రకటించింది. యుద్ధంలో ఇప్పటి వరకు 400మంది తమ దేశ పౌరులు మృత్యువాతపడ్డారని, అందులో 83 మంది చిన్నారులు ఉన్నట్లు లెబనాన్ ప్రకటించింది. ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు కూడా మరణించారు. గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడబోమని చెబుతూ ఇరాన్ దేశాధ్యక్షుడు క్షమాపణ ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం దానికి భిన్నంగా జరుగుతోంది. గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్‌పై ఇరాన్ కూడా విరుచుకుపడింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో పాటు సమీపంలో చమురు డిపోలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
సోషల్ సెక్యూరిటీ టవర్‌పై డ్రోన్ల శకలాలు పడడంతో దానికి మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో దుబాయ్‌ను కూడా లక్షంగా ఎంచుకుని వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించింది. ఈ ఘటనలో దుబాయ్‌లోని ప్రఖ్యాత మెరీనా టవర్‌పై ఓ క్షిపణ శకలాలు కుప్పకూలడంతో ప్రజలంతా భయకంపితులయ్యారని తెలుస్తోంది. అయితే ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు, డ్రోన్లను యుఎఇ నేలకూల్చింది. బహ్రెయిన్‌లోని డిశాలినేషన్ ప్లాంట్‌పై ఇరాన్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ మీదుగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. నష్టం వివరాలు తెలియకున్నా ఇజ్రాయెల్ కూడా దాడులను ధ్రువీకరించింది. భారీ ఎత్తున్న క్షిపణులు తమ దేశంపైకి దూసుకొచ్చాయని, పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయని వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మున్ముందు మరిన్ని సర్‌ప్రైజ్‌లు చవిచూడబోతోందని హెచ్చరించారు. ఇరాన్ విభజన తమ లక్షం కాదని, అక్కడి నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమేనని స్పష్టం చేశారు.