Reading Time: 2 minutes

హాజరైన కౌన్సిల్ చైర్మన్ గుత్తా, అసెంబ్లీ స్పీకర్ గడ్డం

బిఆర్‌ఎస్, బిజెపి, మజ్లీస్ ఎమ్మెల్సీలు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః శాసనమండలి (కౌన్సిల్) సభ్యుల కోసం దేదీప్యమానంగా పునరుద్ధరించిన భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గుమ్మడి కాయ కొట్టారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత ఎస్. మధుసూదనా చారి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణా రావు, శ్రీధర్ బాబు, వివేక్ వెంకట స్వామి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వ విప్‌లు, బిఆర్‌ఎస్, బిజెపి, మజ్లీస్ ఎమ్మెల్సీలు, పలువురు ఎమ్మెల్యేలు, తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి, అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆవరణ అంతా పరిశీలించిన సిఎం

ఇదిలాఉండగా నిజాం కాలం నాటి పాత అసెంబ్లీ భవనాన్ని కౌన్సిల్‌గా మార్చాలని తొలుత ఆలోచన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనులన్నీ తాను అనుకున్న విధంగా జరిగాయా? లేదా? అని ఆవరణ అంతా తిరిగి పరిశీలించారు. తన కోసం కేటాయించిన ఛాంబర్‌లోకి వెళ్ళి కొంత సేపు కూర్చున్నారు. అనంతరం కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్‌కూ వెళ్ళి గుత్తాను చైర్‌లో కూర్చోబెట్టి సన్మానించారు. అనంతరం డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఛాంబర్‌కూ వెళ్ళి ఆయన్నూ సన్మానించారు. ఆ తర్వాత తేనేటి విందు ఏర్పాటు చేసిన హాలులోకి వెళ్ళారు. అక్కడ తమతో పాటు కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మధుసూదనా చారి కనిపించకపోవడంతో సిఎం తన సిబ్బందికి చెప్పి పిలిపించుకున్నారు.

కార్మికులకు సన్మానం

కౌన్సిల్ భవనాన్ని పునరుద్ధరించిన ఆగాఖాన్ సలహాదారులకు, కార్మికులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు.

సిఎంతో వరంగల్ ముఖ్య నేతల భేటీ

ఇదిలాఉండగా అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు కలిసి కొంత సేపు చర్చించారు. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ఎంపీ కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి 5,277 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జివో జారీ చేశారని చెప్పారు. ఈ రెండేళ్ళలో వరంగల్ రూపురేఖలను మారుస్తామని ఆమె తెలిపారు.

ప్రొటోకాల్ సమస్యపై చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తాం: దాసోజు

జిల్లాల్లో తమ పార్టీ ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు తరచూ ప్రొటోకాల్ సమస్య వస్తున్నదని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆదివారం ‘మన తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్‌పిలు పట్టించుకోకపోవడంతో, కింది స్థాయి అధికారులూ ప్రొటోకాల్ పాటించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై తాము కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయడానికి లేఖ సిద్ధం చేశామని ఆయన చెప్పారు. అయితే ఈ రోజు సిఎం రేవంత్ రెడ్డితో పాటు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బిజీగా ఉన్నందున లేఖను ఇవ్వలేకపోయామని, ఒకటి, రెండు రోజుల్లో చైర్మన్‌ను కలిసి అందజేస్తామని డాక్టర్ శ్రవణ్ దాసోజు తెలిపారు.