
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుండి మొదలుకానున్న జాతి జనగణనలో బిసి కులగణన చేపట్టాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చేసిన బిసి రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించాలని ఆయన కోరారు. పై డిమాండ్‌ల సాధన కోసం ఈ నెల 23న బిసిల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బిసిల చలో ఢిల్లీ సందర్భంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక రోజు భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
కొన్ని దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలని బిసిలు ఉద్యమాలు చేపడితే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి జాతి జన గణనలో సమగ్ర కులగణన చేపడతామని ప్రకటించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తాము ప్రకటించినట్లుగా వచ్చే నెల ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి దేశవ్యాప్తంగా జాతి జనగణన చేపడుతుందని మొదటి దఫాలో కుటుంబ ఇంటి లెక్కలు తీస్తుందని, ఇందులో 33 ప్రశ్నలను రూపొందించి అందులో ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలు ఎన్ని అడిగిన కేంద్ర ప్రభుత్వం బిసి కుటుంబాల సంఖ్యను విస్మరించడం చాలా బాధాకరమన్నారు.
ఇండ్ల లెక్కింపులో కూడా బిసి ఇండ్లను లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు. బిసిలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టానిన కేంద్ర ప్రభుత్వానికి పంపించి సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఇంతవరకు బిసి రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో బిసి రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటులో బిసి రిజర్వేషన్ల విషయంలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటింటి లెక్కింపులో బిసి కుటుంబాల లెక్కింపు, బిసి రిజర్వేషన్ల పెంపుకు జరుగుతున్న ఈ భారీ ధర్నాకు దేశంలోని 29 రాష్ట్రాల నుండి బిసిలంతా పెద్ద ఎత్తున కదిలి వచ్చి విజయవంతం చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.