Reading Time: 2 minutes

నేడు న్యూజిలాండ్‌తో భారత్ టైటిల్ పోరు

అహ్మదాబాద్: ఐసిసి టి20 ప్రపంచకప్ తుది చేరుకుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది. అయితే, ఇరు జట్లలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదువలేదు. ఫించ్ హిట్టర్లు, పేస్ బౌలర్లతో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. వరుస గెలుపులతో సెమీస్ చేరిన ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి జట్లను మట్టికరిపించి ఫైనల్ చేరిన ఇరు జట్ల మధ్య మ్యాచ్ కావడంతో హోరాహోరీ పోరు ఖాయంగానే కనిపిస్తోంది. సూపర్8లో భారత్ మాత్రం కాస్త చెమటోడ్చి సెమీస్ బెర్త్‌ను దిక్కించుకున్న భారత్ సెమీస్‌లో భారీ స్కోరు చేసినా ఆశించిన ఫలితం దక్కించుకోవడంలో విఫలమైదనే చెప్పాలి. కేవలం 7 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది.

ఇక, సంజు శాంసన్ ఫామ్‌లోకి రావడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సంజు తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే టీమిండియాకు ఎదురే ఉండదు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తన పాత్రను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంది. ఈ వరల్డ్ కప్‌లో ఒక హాఫ్ సెంచరీ తప్ప, ఆరు మ్యాచుల్లో తీవ్రంగా నిరాశ పరిచాడు. అంతేకాదు, ఇంగ్లండ్‌తో సెమీస్‌లో సయితం 8 పరుగులే చేసి పెవిలియన్ దారి పట్టాడు. దీంతో ఈ మ్యాచ్ అభిషేక్‌కు సవాల్ వంటిదే చెప్పొచ్చు. నిలకడగా రాణిస్తున్న ఇషాన్ కిషన్ కూడా జట్టుకు కీలకమే. ఫామ్ లోనించినట్టు కనిపించినా సెమీస్‌లో రాణించడం కాస్తా కలిసొచ్చే అంశమనే చెప్పొచ్చు.

సూర్యపైనే అందరి చూపు

ఈ వరల్డ్ కప్‌లో ఆచీతూచి రాణిస్తున్న టీమిండియా సారథి సూర్యాకుమార్.. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత తనపై ఉంది. కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో సూర్య జట్టుకు ఆసారాగా నలుస్తాడనుకుంటే తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. దీంతో ఫైనల్లో బ్యాట్‌తో పాటు కెప్టెన్సీతో జట్టుకు అండగా నిలవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సూర్య తన మార్క్ ఆటతో చెలరేగితే న్యూజిలాండ్ బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్, హార్దిక్, అక్షర్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండడం జట్టుకు కలిసి వచ్చే అంశమనే చెప్పాలి.