Reading Time: < 1 minute

ప్రతిరోజు చెత్త సేకరణ జరగాలి

క్యూర్ పరిధిలో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి

కొత్త డంప్ యార్డులు అందుబాటులోకి తీసుకురండి

మున్సిపల్ కమిషనర్లతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్స్‌కు సంబంధించిన ఉన్నతాధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సిఎం పలు సూచనలు చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాలని ఆయన ఆదేశించారు.

చెత్త సేకరణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఒక్కో వాహనానికి ఒక్కో ఏరియా చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలని సిఎం అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు

ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతో పాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు.

సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎం సెక్రటరీ మాణిక్ రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీకర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన, మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, హెచ్‌ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.