
రాజకీయాలు ఎప్పుడూ స్తబ్దుగా ఉండవు. ఒక్కోసారి చాలావేగంగా మారుతూ ఉంటాయి. అలా మారే క్రమంలో ఎక్కడో కింద ఉండిపోయినవాళ్లను శిఖరాగ్రాన కూర్చోబెట్టడం, మీది అంతస్తులో ఉన్నవాళ్లను దభేల్‌న కింద పడేయడం రాజకీయాల విచిత్ర క్రీడలో భాగం. ప్రస్తుతం దేశంలో 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయి, వాటికి ఈ నెల 16న ఎన్నికలు జరగబోతున్నాయి. రాజ్యసభ నుంచి రిటైర్ కాబోతున్నవారిలో రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ కూడా ఒకరు. ఆయనది ఏముంది కానీ, ఖాళీ అయిన ఈ స్థానాల భర్తీకి వివిధ పార్టీలు తమ అభ్యర్థులుగా నిలిపినవారిలో ఇద్దరిని గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు, పోటీ లేదు. అందులో ఒకరు ప్రస్తుత బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు నితీశ్ కుమార్. రెండవవారు తెలంగాణ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లనున్న వేం నరేందర్ రెడ్డి. 37 మందిలో వీరు ఓ ఇద్దరు. ఏమిటి వీరి ప్రత్యేకత అనుకోవచ్చు. ఈ ఇద్దరు అభ్యర్థులు రాజకీయ విచిత్ర క్రీడకు మంచి ఉదాహరణ. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురించి ముందు మాట్లాడుకుందాం. ఆయన ఓ రెండు దశాబ్దాలుగా బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.
దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో నితీశ్ కూడా ఒకరు. నాలుగు మాసాల క్రితం ఆయన పదవసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్రకెక్కారు. 15 ఏళ్లపాటు బీహార్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన రాష్ట్రీయ జనతాదళ్ పాలనను ముగింపజేసి కూడా రికార్డుకు ఎక్కారు నితీశ్ కుమార్. దేశంలో అత్యధికసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతి బసు (పశ్చిమ బెంగాల్), గెగాంగ్ అపాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), కరుణానిధి (తమిళనాడు), ప్రకాష్ సింగ్ బాదల్ (పంజాబ్), పవన్ కుమార్ ఛాంలింగ్ (సిక్కిం), నవీన్ పట్నాయక్ (ఒడిషా) ల సరసన నితీశ్ కుమార్‌ను నిలబెట్టొచ్చు. ఈ జాబితాలో అందరికంటే ఎక్కువ కాలం 23 సంవత్సరాలపాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు జ్యోతిబసు.
నాలుగు మాసాల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీచేసి మళ్లీ అధికారంలోకి వచ్చిన నితీశ్ కుమార్ ఎందుకు హఠాత్తుగా రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు? అంతకు సంవత్సరం ముందు జరిగిన లోకసభ ఎన్నికల్లో గత రెండు పర్యాయాలు జరగని విధంగా భారతీయ జనతా పార్టీకి 240 స్థానాలు మాత్రమే దక్కి, తప్పనిసరిగా భాగస్వామ్య పక్షాల మీద, అందులో ముఖ్యంగా బీహార్‌లో నితీశ్ కుమార్ నాయకత్వంలోని జెడి(యు), ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీల సహాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూటమి తరఫున నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా మరొకసారి ఎన్నికయిన నాలుగు మాసాల్లోనే రాజ్యసభకు వెళ్లడానికి పదవీత్యాగం చేయడానికి కారణాలేమిటి? అనే ప్రశ్న అందరిని తొలుస్తున్నది. బయటి వాళ్ళ పరిస్థితి ఏమో గాని నితీశ్ నాయకత్వం వహిస్తున్న జనతాదళ్(యు) కిందిస్థాయి నాయకత్వం, కార్యకర్తలు మాత్రం ఈ హఠాత్పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బీహార్ రాష్ట్రంలో అధికారం తమ పార్టీ చేజారి బిజెపి చేతుల్లోకిపోతున్నదని వాళ్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
నితీశ్ ఈ హఠాత్ నిర్ణయానికి బయటికి చెబుతున్న కారణం.. ఆయన శాసనసభలో, మండలిలో, లోకసభలో చాలాసార్లు సభ్యుడిగా ఉండి ప్రజలకు సేవ చేశారు.. ఇక మిగిలిన ఒక్క పెద్దల సభలో కూడా సభ్యుడిగా ఉండాలన్నది ఆయన కోరిక అని. వినడానికి బాగానే ఉంటుంది కానీ నిజంగా కారణం అదేనా? వయసు మీద పడింది, అనారోగ్య సమస్యలు ఉన్నాయనేవి ఉత్త మాటలు. ఎందుకంటే అధికారం పనిచేసినంత బలంగా ఇంకే ఔషధమూ పని చెయ్యదు. కొద్దికాలం క్రితం ఉపరాష్ట్రపతిగా ఉండిన జగ్దీప్ ధన్కడ్ కూడా ఆరోగ్య కారణాలతో హఠాత్తుగా అంతర్ధానం కావడం గురించి ఇప్పటికీ చెవులు కొరుక్కుంటున్నవారులేకపోలేదు. పోనీ జెడి(యు) అధికారంలో లేనప్పుడు, నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా లేనప్పుడు భారతీయ జనతా పార్టీ వయసులో పెద్దవాడిగా గౌరవించి నితీశ్ కుమార్‌ని రాజ్యసభకు పంపించి ఉంటే పైవాదనకు విలువ ఉండేది.
నిజానికి నితీశ్ కుమార్ ఏమీ చిన్న నాయకుడు కాదు. ఒక దశలో బిజెపి, కాంగ్రెస్ ఈ రెండు పార్టీల నుండి కాకుండా ప్రధానమంత్రిని ఎంపిక చేసుకోవాల్సి వస్తే నితీశ్ కుమార్ సరైన అభ్యర్థి అన్న వాదన వినిపించింది. అందరూ ఆమోదించదగ్గ ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చిన ఇమేజ్‌ని పోగొట్టుకోవడం నితీశ్ స్వయంకృతాపరాధం.
రేపు 16వ తేదీన రాజ్యసభ ఎన్నికలు లాంఛనంగా పూర్తయ్యాక ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయడం, ప్రస్తుతం బీహార్ కూటమిలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి నాయకుడు సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడం ఖాయం అయిపోయింది అంటున్నారు. బీహార్ రాజకీయాల్లో ప్రస్తుతం నితీశ్ కుమార్‌కు, సామ్రాట్ చౌదరికి కొంతకాలంగా అసలే పొసగడం లేదన్న వార్త బాగా చక్కర్లు కొట్టింది. నితీశ్ కుమార్‌ను రాజ్యసభకు పంపడమే కాకుండా ఆయనకు కేంద్రంలో మంత్రిపదవి ఖాయమని, అది కూడా రైల్వేమంత్రిత్వ శాఖ ఇస్తారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతున్నది. కేంద్రంలో ప్రభుత్వం సజావుగా నడవడానికి జెడి(యు) అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ పని చేస్తే చేయొచ్చు. కానీ బీహార్ వంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా వెళ్లిపోవడంవల్ల నితీశ్‌కు, ఆయన పార్టీకి రాజకీయంగా జరిగే నష్టం అంచనా వేయడానికి పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. ఆ విషయం నితీశ్ కుమార్‌కు తెలియక కాదు కానీ ఆయన పార్టీ వారికైతే బాగా అర్థమైంది. అందుకే రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి. నితీశ్ ను రాజ్యసభకు పంపించి, ఆయన కుమారుడు నిశాంత్ కుమార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారని జరుగుతున్న ప్రచారం బహుశా జెడి(యు)లో ఆందోళనల నిప్పు మీద నీళ్లుచల్లడం కోసం కావచ్చు. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని వదులుకుని ఆరో వేలులాంటి ఉపముఖ్యమంత్రి పదవిని కొడుకు కోసం నితీశ్ కుమార్ ఏ ప్రయోజనాన్ని ఆశించి లేదా ఏ ఒత్తిడికి లొంగి అంగీకరించారు అన్న చర్చ పెద్దయెత్తున జరుగుతున్నది.
బీహార్ పరిణామాలు జాతీయ మీడియాలో పొక్కగానే ఎన్‌డిఎలో బిజెపికి మద్దతుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో కలకలం మొదలైందట. రేపో మాపో నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా రాజ్యసభకు వెళ్ళమంటారేమోనని తెలుగు తమ్ముళ్లు బెంబేలుపడిపోతున్నారు.ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా రాష్ట్రంకోసం త్యజించిన తమ నాయకుడికి ఆ పరిస్థితి తప్పదా అన్న ఆందోళన మొదలయిందట. సరే, అదిగో తోక అంటే ఇదిగో పులి అనే అమాంబాపతు మీడియా సంస్థలు అప్పుడే చంద్రబాబు ఉపప్రధాని అవుతారని, ఆంధ్రప్రదేశ్‌కు యువ నాయకుడు లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతారని సాయంకాలం చర్చల్లో ఊదరగొట్టడం మొదలుపెట్టాయి. ఇటువంటి ఉపద్రవం ఏదోవస్తుందనే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గరనుండి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అవకాశం దొరికినప్పుడల్లా 15 ఏళ్ల పాటు చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అని పదే పదే ప్రకటిస్తున్నారు. ఇక ఆయన్ని సమర్థించే మరో మీడియా సంస్థ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన పార్టీ బిజెపి పవన్ కళ్యాణ్ మీద ఎంతగా ఆధారపడ్డారో బలంగా చెప్పేందుకు ఓ సాయంత్రం తన చానల్లో కొన్ని గంటల సమయం కేటాయించింది. ఉప ప్రధానమంత్రి పదవి అనేది కూడా ఆరో వేలే అన్న విషయం రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు నాయుడుకు తెలియదా? ఈ సందర్భంగా ఉప ప్రధానమంత్రి అన్న మాట మీద చిన్న పిట్ట కథ గుర్తు చేసుకోవాలి. ఎమర్జెన్సీ అనంతరం మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఏర్పడిన జనతా ప్రభుత్వంలో దేవీలాల్ ఉప ప్రధానమంత్రి. ప్రమాణస్వీకారం సమయంలో ఆయనను మంత్రిగా ప్రమాణం చెయ్యమంటే ‘దేవీలాల్ అనే నేను ఉప ప్రధానమంత్రిగా’ అని అనడంతో అధికారులు ఆయనను వారించి ‘రాజ్యాంగంలో ఉప ప్రధానమంత్రి అనే పదవి ఉండదు. అది ఆరోవేలు, మీరు పెట్టుకునేది మాత్రమే’ అని చెప్పారట.
అయితే నితీశ్ కుమార్ లాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు కూడా వస్తే తప్పదేమో కానీ బీహార్‌లో నితీశ్ స్థానంలో ముఖ్యమంత్రి పదవి బిజెపికి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో అది సాధ్యమయ్యే పనేనా లేక ఎనిమిది స్థానాలకే పరిమితమైనా కూడా బిజెపి అది సాధ్యం చేసుకుంటుందా చూడాలి. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి కూడా తక్కువ తరగతిలో కూర్చున్న పరిస్థితి నితీశ్ కుమార్ ది.
ఇక తెలంగాణ నుండి ప్రస్తుతం రాజ్యసభకు వెళుతున్న ఇద్దరిలో ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ నుండి 2004 లో మొదటిసారి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత 2010 లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత జరిగిన ఆసక్తికర పరిణామంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రి హైదరాబాద్ వీడి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడటానికి శాసనసభ నుండి మండలికి జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున వేం నరేందర్‌రెడ్డి అభ్యర్థిగా ఉండటం కారణం. అప్పట్లో తెలుగుదేశం నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఒక కేసులో కొద్దికాలం జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ కేసులోని పూర్వాపరాలు, మంచిచెడ్డలు, నిజానిజాలను గురించి చర్చించడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఎందుకంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మరికొందరి మీద ఓట్ల కోసం శాసనసభ్యులను ఫిరాయింపజేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పుడు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి తాను అధికారంలో ఉన్నంతకాలం ఎడాపెడ శాసనసభ్యులను తన పార్టీలోకి ఫిరాయింపచేసుకున్న సందర్భాలు చూశాక రాజకీయాల్లో ఇటువంటి విషయాలను గురించి చర్చించడం కూడా దండగమారి పనే అనిపిస్తుంది. కొందరు దొరుకుతారు, చాలామంది దొరకరు.
అదలా ఉంచితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ తరువాత కాలంలో రేవంత్‌రెడ్డి వెంట నరేందర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం, ప్రజామోదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్‌రెడ్డి కష్టాన్ని గుర్తించి అధిష్టానవర్గం ఆయనను ముఖ్యమంత్రిని చేయడం, ముఖ్యమంత్రి సలహాదారుగా నరేందర్ రెడ్డి నియమితులు కావడం. ఏ శాసనసభలో అయితే మండలికి ఎన్నికయ్యేందుకు శాసనసభ్యులను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చి, ఆ ఎన్నికల్లో ఓటమి కూడా చవిచూసిన నరేందర్ రెడ్డిని అదే శాసనసభ ఈరోజు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నిక చేసి పంపింది. రాజకీయాలను నమ్ముకున్నవారిని అవి ప్రతిసారీ కింద పడేయవు. అప్పుడప్పుడు ఇలా పైకి కూడా లేపుతుంటాయి. పదహారుమంది ఆశావహుల జాబితానుండి అధిష్టానం వేం నరేందర్‌రెడ్డి పేరును ఎంపిక చెయ్యడం అంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి 9 ఏ కోట్లామార్గ్‌లోని ఇందిరాభవన్‌లో ఎంత పలుకుబడి ఉందో ఎవరయినా అర్థం చేసుకోవచ్చు. రాజకీయ వైకుంఠపాళిలో గవ్వలు అనుకూలంగా పడి వేం నరేందర్ రెడ్డి నిచ్చెన ఎక్కారు. నితీశ్ కుమార్‌ను మాత్రం పాము మింగింది.
దేవులపల్లి అమర్