Reading Time: 3 minutes

నాడు నిజాం టౌన్ హాలు.. నేడు కౌన్సిల్ హాలు

తుది మెరుగులు దిద్దుకుని ముస్తాబైన భవనం

సిఎం చేతుల మీదుగా నేడు ప్రారంభోత్సవం

ఇండో-ఇస్లామిక్ శైలిలో, రాజస్థానీ-పర్షియన్ మిశ్రమ ఆర్కిటెక్చర్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః నిజాం కాలంలో ప్రజా సమస్యలు చర్చించి పరిష్కరించేందుకు వెలసిన టౌన్ హాలు, ఇకమీదట ప్రజా సమస్యలపై చర్చించేందుకే ఎమ్మెల్సీల కోసం (పెద్దల సభ)గా రూపాంతరం చెందబోతున్నది. తుది మెరుగులు దిద్దుకుని ముస్తాబైన చారిత్రాత్మక భవనం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం (8న) ప్రారంభంకాబోతున్నది.

చూడని వారుండరు..

నగరం నడిబొడ్డున ఇంత గొప్ప చారిత్రాత్మక భవనాన్ని చూడని వారుండరు. ఈ చారిత్రాత్మక భవన నిర్మాణ కౌశల్యాన్ని మెచ్చుకోని వారుండరు. అయితే సాధారణ ప్రజలకు లోపలికి అనుమతించరు. కేవలం అసెంబ్లీ సమావేశాల సమయంలో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు, మీడియా ప్రతినిధులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రజలు సందర్శించాలనుకుంటే అందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సులు తప్పని సరి.

పూర్వాపరాల్లోకి వెళితే..

ఆరవ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన 40వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1913 సంవత్సరంలో ప్రజల సేవ కోసం ఈ భవనాన్ని అంకితమిచ్చారు. అయితే ఈ భవన నిర్మాణానికి ప్రజలు కూడా చందాలు వేసుకుని భవన నిర్మాణానికి తమ వంతు సహాయం చేశారు. ఇండో-ఇస్లామిక్ శైలిలో రాజస్థానీ-పర్షియన్ మిశ్రమ ఆర్కిటెక్చర్‌తో ఆత్యద్భుతంగా భవన నిర్మాణం జరిగింది. ఈ అద్భుత కళాఖండం కట్టడానికి ఎనిమిదేళ్ళ వ్యవధి పట్టింది.

అసెంబ్లీ సమావేశాలకూ ..

ఇంత అద్భుతమైన కట్టడంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, ఎమ్మెల్యేలు తమ సమస్యల పరిష్కారాలపై ఈ భవనంలో చర్చిస్తారని ప్రజలందరూ అనుకుంటారు. కానీ అది కొంత వరకే నిజం. చాలా ఏళ్ళ క్రితం వరకూ ఈ భవనంలో అసెంబ్లీ సమావేశాలు జరిగింది వాస్తవమే. కాల క్రమేణా ఈ భవనం నిరుపయోగంగా మారింది.

నిరుపయోగానికి కారణం?

దేశానికి 1947 సంవత్సరంలో స్వాతంత్య్రం లభించిన తర్వాత 1948 సంవత్సరం సెప్టెంబర్ 17న అంటే సుమారు 13 నెలల తర్వాత నిజాం ప్రభువు కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ పటేల్ ముందు తలవంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్‌గా ఏర్పడింది. 1948-1952 వరకూ ఈ భవనం ఖాళీగా ఉన్నది. తొలిసారి 1952 లో ఎన్నికల అనంతరం ప్రజా ప్రభుత్వం ఏర్పడడంతో ఈ భవనంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 1956 సంవత్సరంలో రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి1985 సంవత్సరం వరకూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.

కాగా 1979లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ఈ భవనం వెనక భాగంలో నూతన భవనానికి శంకుస్థాపన చేయగా, 1985 సంవత్సరంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రారంభించారు. అప్పటి నుంచీ ఈ కొత్త భవనంలోనే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే కౌన్సిల్ సమావేశాలు పబ్లిక్ గార్డెన్స్ ఆవరణలోని జూబ్లీహాలుకు పక్కన ఉన్న హాలులో జరిగేవి. కాగా 1985 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు కౌన్సిల్‌ను రద్దు చేశాక ఆ కౌన్సిల్ భవనం కూడా నిరుపయోగంగా మారింది. ఇప్పుడు ప్రధాన రోడ్డుపై కనిపించే నాటి అసెంబ్లీ భవనం, కౌన్సిల్ భవనం అనేక సంవత్సరాలుగా మూసి ఉంచారు.

వైఎస్ హయాంలో తిరిగి ప్రారంభం

2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కౌన్సిల్‌ను పునరుద్ధరించారు. దీంతో ప్రతి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగానికి మాత్రమే (ఒక్క రోజు) అసెంబ్లీ భవనాన్ని వినియోగించేవారు.

రాష్ట్ర విభజన తర్వాత ..

ఇదిలాఉండగా రాష్ట్ర విభజన (2014) తర్వాత పదేళ్ళ పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సి ఉండడంతో కొంత కాలం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ పాత భవనంలో జరగడం విశేషం. రాష్ట్ర విభజనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత కాలం సమావేశాలు ఈ భవనంలో కొనసాగించారు. అయితే అమరావతిలో తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పదేళ్ళ గడువు ముగియడం ఆ భవనాన్ని తెలంగాణకు కేటాయించారు. రాష్ట్ర విభజనతో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యుల కోసం జూబ్లీహాలు పక్కన ఉన్న పాత కౌన్సిల్ భవనాన్నే కేటాయించగా, అప్పటి గవర్నర్ నరసింహన్ అసెంబ్లీ, కౌన్సిల్ పరిసరాల్లోని భవనాలను సందర్శించినప్పుడు జూబ్లీహాలును తెలంగాణ కౌన్సిల్ కోసం సిద్ధం చేయించారు. ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీల కోసం పాత అసెంబ్లీ భవనం సిద్ధమైనందున, ఇకమీదట జూబ్లీహాలును ప్రభుత్వ కార్యక్రమాలకు నిర్వహించుకునే అవకాశం ఉంది.

సిఎం రేవంత్ రెడ్డి చొరవ..

2024లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత తన దృష్టి నిజాం కాలం నాటి టౌన్ హాలుపై పడింది. ప్రస్తుతం తెలంగాణ కౌన్సిల్ సమావేశాలు జూబ్లీహాలులో జరుగుతున్నందున, దానిని కౌన్సిల్ సమావేశాల కోసం ఉపయోగించాలన్న ఆలోచన చేశారు. అందుకు అనుగుణంగా కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో చర్చించి అవసరమైన మేరకు భవనానికి కొత్త మెరుగులు దిద్దారు. ఈ భవన నిర్మాణం ప్రత్యేకతల కారణంగా యాభై అడుగుల ఎత్తులో పైకప్పు ఉండడం, అలాగే దానిని సున్నపురాయితో విశాలంగా నిర్మించడం వల్ల లోపల చాలా చల్లదనంతో పాటు ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. నిజాం కాలంలో నిర్మితమైన ఈ భవనం రాజస్థానీ-పర్షియన్ మిశ్రమ ఆర్కిటెక్చర్‌తో నిర్మించినందుకన దానికి ఎక్కడా భంగం వాటిల్లకుండా అత్యాధునిక పివోపి ద్వారా తెల్లగా, మెరిసెలా రూపాంతరం చెంది ఈ భవనం ముస్తాబు చేశారు. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నారు.

తెలంగాణ తల్లి విగ్రహం..

అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలు కనిపిస్తాయి. మహాత్ముని పక్కన గాంధీ విగ్రహం ఉన్నట్లే మరో పక్కన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకున్నా, సకాలంలో పనులు పూర్తికాకపోవడంతో ఈ నెల 16వ తేదీ వరకూ సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొత్త భవనంలో కొత్త గవర్నర్

బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16న ప్రారంభంకానున్నందున కొత్త భవనంలో రాష్ట్రానికి కొత్తగా నియమితులైన గవర్నర్ శివప్రసాద్ శుక్లా ఉభయ సభల సభ్యులనుద్ధేశించి ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలకు ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది.

ఏడవ నిజాం కల జూబ్లీ హాలు..

ఇక ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ తన జ్ఞాపకార్ధంగా పబ్లిక్ గార్డెన్ ఆవరణలో జూబ్లీహాలును నిర్మించి తన కల నెరవేర్చుకున్నారు. 1936 సంవత్సరంలో తన ఇరవై అయిదవ ఏట జూబ్లీహాలును ప్రారంభించారు. జూబ్లీ హాలులో దర్బారు పీఠం, తైలవర్ణంతో అసఫ్‌జాహి చిత్రాలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జూబ్లీహాలులో దర్బారు పీఠంపై కూర్చుని ప్రజల నుంచి వినతుల స్వీకరించే వారని ప్రతీతి.