Reading Time: 2 minutes

మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం కేవలం చట్టాలు చేస్తే సరిపోదు

వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి

రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం

ప్రభుత్వం మహిళల ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిస్తోంది

‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం కేవలం చట్టాలు చేస్తే సరిపోదని, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ప్రభుత్వాల బాధ్యత నెరవేరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని జేఎన్‌టియూలో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, అందుకే తమ ప్రభుత్వం మహిళల ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిస్తోందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు శక్తిమేర పదవులను కట్టబెట్టడమే కాకుండా, ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదే అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మన బాధ్యత తీరిపోలేదని, దేశానికి రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌కు తెలంగాణలో ప్రజలు అధికారం ఇచ్చారని, అందుకే మహిళల ప్రాధాన్యతను గుర్తించి, బాధ్యతలను అప్పగించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుం టుందని ఆయన తెలిపారు.

మహిళను మనం శక్తితో పోలుస్తామని, అలాంటి మహిళలకు రక్షణ కల్పించలేకపోతే ఏ రాష్ట్రా నికి గౌరవం కాదని, ఇంతకు ముందు మహిళల వేధింపులు కొంతవరకే పరిమితమయ్యేవన్నారు. కానీ, సాంకేతిక అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలోనూ మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని, అందుకే మనల్ని మనం సవరించు కొని బాధ్యతతో మెలగాల్సిన సమయం వచ్చిందని, సమాజంలో చట్టాలను చేయడం, పోలీసులు పర్యవేక్షించడమే కాదన్నారు. మనమంతా సామాజిక బాధ్యతగా భావిస్తేనే మహిళల రక్షణ సాధ్యమవుతుందని, మన ఇంటి ఆడబిడ్డలకు ఎలాంటి గౌరవం ఇస్తామో సమాజంలో ఆడబిడ్డలను అలాగే గౌరవించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు..

మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళల పేరుతోనే అందిస్తున్నామని, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతో అందిస్తున్నామని, స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించి వారికి శిల్పారామం వద్ద దుకాణ సముదాయాన్ని కేటాయించామన్నారు. అదేవిధంగా గ్రామీణ మహిళల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ, వారి ఉత్పత్తులను ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా విక్రయించేలా ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కేవలం ఉచిత ప్రయాణమే కాకుండా, మహిళా సంఘాల ద్వారా ఆర్టీసిలో 1,000 బస్సులను నడిపిస్తూ వారిని వ్యాపార భాగస్వాములుగా మార్చామన్నారు.

తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడంలో మహిళల కృషి ఎంతో ఉందని సిఎం కొనియాడారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారికి అన్ని వేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణను మహిళలకు అంత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమం తీసుకున్నామని ఆయన తెలిపారు. మహిళల రక్షణకు ప్రతి యువకుడు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవాలన్నారు. మహిళలు వంటింటి కుందేళ్లుగా కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్షఅని ఆయన తెలిపారు. మహిళల రక్షణ కోసం నిలబడి ప్రశ్నించే తత్వాన్ని అంతా పెంపొందించుకోవాలని సోషల్ మీడియా పెరగడంతో సైబర్ క్రైమ్ పెరిగిపోయిందని సమస్య వచ్చినపుడు ‘స్టాండ్ విత్ హర్’ అని గట్టిగా నిలబడాలని ఆయన అన్నారు.