Reading Time: < 1 minute

ప్రతి నెల రూ.2500, పెళ్లి కూతుళ్లకు పట్టుచీర, 8గ్రాముల బంగారం

మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం

సూపర్ సిక్స్ కింద ఆరు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితం

విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఏటా రూ.15వేలు

రూ.5లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

ఎన్నికల వాగ్దానాలు గుమ్మరించిన టివికె చీఫ్

చెన్నై: టివికె అధినేత, తమిళనాడు ఎన్నికల రంగంలో దిగుతున్న నటుడు విజయ్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. ముఖ్యంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారంనాడు మామళ్లాపురంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మహిళా ఓటర్లను ఆకర్షించడమే లక్షంగా పథకాలను ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు మినహా మిగతా మహిళలకు ప్రతినెలా ఆర్థిక సాయం కింద రూ.2500 అందజేయనున్నట్లు ప్రకటించారు.

పెళ్లి కూతుళ్లకు పట్టు చీరతో పాటు 8 గ్రాముల బంగారాన్నిఅందజేయనున్నట్లు వెల్లడించారు. అన్నపూర్ణ సూపర్ సిక్స్ పథకం పేరిట అన్ని కుటుంబాలకు ప్రతి ఏడాది 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించేందుకు ప్రతి తల్లి, సంరక్షుల ఖాతాల్లో ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం జమ చేస్తామని తెలిపారు.

అదే విధంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడతామని, బస్సుల్లో పానిక్ బటన్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్కూళ్లు, రేషన్ షాపుల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేస్తామన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.5లక్షల వరకు జీరో వడ్డీ రుణాలు అందజేస్తామన్నారు. అప్పుడే పుట్టిన ప్రతి బిడ్డకు ఆశీర్వాద్ పథకం పేరిట బంగారు ఉంగరం, వెల్‌కమ్ కిట్ బహుమతిగా ఇవ్వనున్నట్లు విజయ్ తెలిపారు. మహిళలపై అకృత్యాలను అడ్డుకునేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన కేసుల విచారణ వేగవంతం చేస్తామని, త్వరితగతిన ఆడబిడ్డలకు న్యాయం దక్కేలా చర్యలు తీసుకుంటామని విజయ్ వాగ్దానం చేశారు.